హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: రాజన్నకు ఆ ఛాన్స్ లేకుండా చేస్తున్నారా?

విజయనగరం జిల్లా సాలూరు నియోజవర్గం....వైసీపీకి కంచుకోట. గత రెండు పర్యాయాలు ఇక్కడ వైసీపీ గెలుస్తూ వస్తుంది. అయితే అంతకముందు సాలూరు నియోజకవర్గం టి‌డి‌పికి అనుకూలంగా ఉండేది. 1983 నుంచి ఇక్కడ ఎక్కువసార్లు టి‌డి‌పి గెలిచింది. 1983 నుంచి 2004 వరకు ఇక్కడ ఆరుసార్లు ఎన్నికలు జరిగితే టి‌డి‌పి అయిదుసార్లు గెలిచింది. అందులో రాజేంద్ర ప్రతాప్ భాంజ్ మూడు సార్లు టి‌డి‌పి తరుపున గెలిచారు.
అయితే 2009 ఎన్నికల నుంచి ఇక్కడ రాజన్న దొర హవా మొదలైంది. 2009లో రాజన్న కాంగ్రెస్ తరుపున బరిలో దిగి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2014, 2019 ఎన్నికల్లో వరుసగా వైసీపీ నుంచి విజయం సాధించారు. సీనియర్ నేత కావడంతో రాజన్నకు మంత్రి పదవి రావడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ బొత్స సత్యనారాయణ మంత్రి పదవిని పుష్పశ్రీ వాణికి దక్కేలా చేశారని జిల్లా రాజకీయాల్లో ప్రచారం జరిగింది. అయితే ఈ సారి మాత్రం రాజన్నకు మంత్రి పదవి దక్కడం ఖాయమని ప్రచారం జరుగుతుంది. ఇక ఈ సారి రాజన్నకు పదవి రాకుండా రాజకీయం జరిగే అవకాశం కూడా లేకపోలేదని తెలుస్తోంది. ఆ రాజకీయాన్ని దాటుకుని రాజన్న పదవి సాధిస్తారో లేదో రానున్న రోజుల్లో తెలుస్తోంది.


మంత్రి పదవి గురించి వదిలేస్తే, ఎమ్మెల్యేగా రాజన్న బాగానే పనిచేస్తున్నారని తెలుస్తోంది.  నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ...సాలూరులో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అటు ప్రభుత్వం తరుపున అందే సంక్షేమ పథకాలని అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చేస్తున్నారు. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. అయితే సాలూరు నియోజకవర్గంలో పలు సమస్యలు కూడా ఉన్నాయి. నియోజకవర్గంలో రోడ్లు మరీ దారుణంగా ఉండగా, వాటిని అభివృద్ధి చేయాల్సిన అవసరముంది. సాలూరు గిరిజన ప్రాంతం కావడంతో కనీస వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండవు. అలాగే సాలూరు మండలంలో  తాగునీటి సమస్య ఎక్కువగానే ఉంది.


రాజకీయంగా రాజన్న బలంలో పెద్దగా మార్పులు రాలేదు. కానీ ఇప్పుడుప్పుడే ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడం రాజన్నకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. అటు టి‌డి‌పి తరుపున రాజేంద్ర ప్రతాప్ పనిచేస్తున్నారు. ఈయన ఈ మధ్యే నియోజకవర్గంలో యాక్టివ్‌గా పనిచేయడం మొదలుపెట్టారు. మరి వచ్చే ఎన్నికల్లో రాజన్నకు రాజేంద్ర చెక్ పెడతారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: