హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: అసంతృప్తి సెగలు ఆ ఎమ్మెల్యేని దెబ్బతీస్తాయా?

అధికార పార్టీల్లో ఆధిపత్య పోరు ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే. అధికార పార్టీ అనే సరికి నాయకులు ఎక్కువగా హడావిడి చేస్తుంటారు. నియోజకవర్గాల్లో పెత్తనం తమది అంటే తమదే అనేలాగా ముందుకెళ్తారు. ఎమ్మెల్యేకు, ఇతర నాయకుల మధ్య సమన్వయం లేక సొంత పార్టీలో అసంతృప్తి జ్వాలలు ఎక్కువ అవుతాయి.
అలా సొంత పార్టీలో ఉండే అసంతృప్తి సెగలతో ఇబ్బంది పడుతున్న ఎమ్మెల్యేల్లో దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కూడా ఉన్నారు. 2019 ఎన్నికల ముందు అనూహ్య పరిణామాల మధ్య దర్శి వైసీపీ టికెట్ తెచ్చుకున్న మద్దిశెట్టి.. ఆ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచారు. ఇక ఎమ్మెల్యేగా మద్దిశెట్టి తన పని తాను చేసుకుంటూ వెళుతున్నారు. ప్రభుత్వ పథకాల అమలులో ఎలాంటి లోటు లేదు.
అయితే ఇక్కడ వైసీపీలో అంతర్గత విభేదాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. వైసీపీ తరుపున బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సైతం పనిచేస్తున్నారు. ఈయన వర్గం ఇక్కడ యాక్టివ్‌గా ఉంది. 2014లో ఈయనే వైసీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో కొన్ని కారణాల వల్ల ఈయన పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో టికెట్ మద్దిశెట్టికి దక్కింది. మద్దిశెట్టి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక వైసీపీ అధికారంలోకి రావడంతో బూచేపల్లి ఇక్కడ దూకుడుగా పనిచేస్తున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో టికెట్ దక్కించుకోవాలని చూస్తున్నారు. అటు టీడీపీ నుంచి వచ్చిన మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు వర్గం కూడా ఇక్కడ ఉంది. దీంతో వైసీపీలో ఆధిపత్య పోరు పెరిగిపోయింది.
అలాగే పలువురు వైసీపీ నేతలు నియోజకవర్గంలో అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇళ్ల స్థలాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చేసినట్లు టీడీపీ ఆరోపిస్తుంది. తాజాగా ఎమ్మెల్యే సోదరుడు శ్రీధర్ తన సొంత పనికి సంబంధించి ఓ ప్రభుత్వ అధికారిని ఫోన్‌లో బెదిరించిన విషయం బయటపడింది. ఈ అంశాలు అన్నీ వైసీపీ ఎమ్మెల్యేకు నెగిటివ్ అయ్యేలా ఉన్నాయి. ఇక గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయిన కదిరి బాబూరావు సైతం వైసీపీ వైపుకు వెళ్ళడంతో చంద్రబాబు ఇక్కడ టీడీపీ ఇన్‌చార్జ్‌గా పమిడి రమేష్‌ని నియమించారు. ఆయన యాక్టివ్‌గా పనిచేసుకుంటూ వెళుతున్నారు. వైసీపీలో ఆధిపత్య పోరు టీడీపీకి కలిసొచ్చే అవకాశం లేకపోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: