హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: చినబాబుకు ఆర్కే ఛాన్స్ ఇస్తున్నారా?
గత ఎన్నికల్లో సంచలన ఫలితం వెలువడిన నియోజకవర్గాల్లో మంగళగిరి ఒకటి. ఈ స్థానం నుంచి స్వయంగా చంద్రబాబు తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ బరిలో దిగడంతో ఈ స్థానంపై అందరి దృష్టి పడింది. అటు వైసీపీ నుంచి ఆళ్ళ రామకృష్ణారెడ్డి బరిలో నిలిచారు. దీంతో ఆళ్ళపై లోకేష్ సులువుగా గెలిచేస్తారని అంతా అనుకున్నారు. అటు టీడీపీ తరుపున భారీగా ఖర్చు పెట్టారు కూడా. కానీ జగన్ వేవ్, ఆళ్ళ ఇమేజ్ ముందు చినబాబు నిలబడలేకపోయారు.
దాదాపు 7 వేల మెజారిటీ తేడాతో లోకేష్‌పై ఆళ్ళ గెలిచారు. 2014లో కేవలం 12 ఓట్లతో గెలిచిన ఆళ్ళ 2019లో లోకేష్‌ని ఓడించి సత్తా చాటారు. ఇక రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాక ఆళ్ళ తనదైన శైలిలోనే ముందుకెళుతున్నారు. ఒక సామాన్యుడు మాదిరిగా నియోజకవర్గంలో తిరుగుతారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. మంగళగిరిలో ప్రతి ఇంటికి తాను ఎమ్మెల్యేగా కాకుండా ఒక బంధువు మాదిరిగా ఉంటారు.
ప్రభుత్వం అందించే పథకాలు ఆళ్ళకు అడ్వాంటేజ్. కాకపోతే రాజధాని అమరావతి అంశమే ఆళ్ళకు ఎప్పుడైనా ఇబ్బంది అని తెలుస్తోంది. ఎందుకంటే మూడు రాజధానుల పేరిట జగన్, అమరావతిని శాసన రాజధానిగానే పరిమితం చేయనున్న విషయం తెల్సిందే. ఇక దీనిపై అమరావతి ప్రాంత రైతులు గత ఏడాదిన్నర నుంచి ఉద్యమం చేస్తున్నారు. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. గత ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి ఇప్పుడు జరగడం లేదు. అటు నారా లోకేష్ కూడా ఓడిపోయాక మంగళగిరిపై పట్టు సాధించడానికి ప్రయత్నిస్తున్నారు.
రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో ఉంటూనే, నియోజకవర్గంలో ప్రజల సమస్యలపై పోరాటం చేస్తున్నారు. అలాగే అమరావతి రైతులకు అండగా ఉంటున్నారు. ఈ పరిస్థితిలని బట్టి చూస్తే లోకేష్‌కు కాస్త అనుకూలంగా మంగళగిరి రాజకీయాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. కానీ ఆర్కేకు మాత్రం నియోజకవర్గంలో ఇప్పటికీ ఫాలోయింగ్ తగ్గలేదు. రాజధాని ఉద్యమం లేకపోతే ఆళ్ళకు చెక్ పెట్టడం చాలా కష్టం.
అయితే రాజధాని అంశం వల్ల తన రాజకీయ భవిష్యత్ దెబ్బతింటే వ్యవసాయం చేసుకుని అయినా బ్రతుకుతాను అని, లేదంటే జగన్ వెంటే ఉంటానని చెప్పేశారు. మరి వచ్చే ఎన్నికల్లో ఆర్కే రాజకీయ భవిష్యత్ ఎలా ఉంటుందో? చినబాబు మంగళగిరిలో సత్తా చాటుతారేమో చూడాలి.