హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: అక్కడ వైసీపీ ఎమ్మెల్యే దెబ్బకు ‘కళా’ తప్పినట్లేనా?
2019 ఎన్నికల్లో సంచలన విజయాలు నమోదైన నియోజకవర్గాల్లో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ఒకటి. మామూలుగా ఎచ్చెర్ల టీడీపీకి కంచుకోట. 1983 నుంచి 1999 ఎన్నికల్లో వరుసగా టీడీపీదే గెలుపు. ఇక 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. ఇక 2014 ఎన్నికల్లో ఇక్కడ నుంచి ఏపీ టీడీపీ మాజీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు విజయం సాధించారు. వైసీపీ అభ్యర్ధి గోర్లే కిరణ్ కుమార్‌పై స్వల్ప మెజారిటీ తేడాతో గెలిచారు.
అయితే 2019 ఎన్నికలోచ్చేసరికి జగన్ గాలి ముందు కిమిడి నిలబడలేకపోయారు. కిరణ్ కుమార్ చేతిలో 20 వేల మెజారిటీ తేడాతో ఓటమి చవిచూశారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన కిరణ్...తన రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్‌లో మొదలుపెట్టారు. 1992 నుంచి 2013 వరకు ఆ పార్టీలో ఉండి, తర్వాత వైసీపీలోకి వచ్చారు. అలా 2014లో పోటీ చేసి ఓడిపోయి, 2019లో గెలిచారు. ఇక ఎమ్మెల్యేగా గెలిచిన కిరణ్..ప్రజలకు బాగానే అందుబాటులో ఉంటున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందేలా చేస్తున్నారు.
కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు అండగా ఉంటున్నారు. నియోజకవర్గంలో వైద్య సదుపాయాలు సరిగ్గా ఉండేలా చూసుకుంటున్నారు. అలాగే ఆపదలో ఉన్నవారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సాయం చేస్తున్నారు. ఎచ్చెర్లలో కొత్తగా గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు జరిగాయి. గ్రామాల్లో సిసి రోడ్లు నిర్మించారు. అయితే నియోజకవర్గంలో పలు సమస్యలు ఉన్నాయి.
సాగునీరు, తాగునీరు, విద్య, ఉఫాధి ఈ నియోజకవర్గంలో ప్రధాన సమస్యలు. పైడి భీమవరంలో అతిపెద్ద పారిశ్రామిక సముదాయం ఉన్నా స్థానికులకు మాత్రం అందులో అవకాశాలు లేవు. ఇక అతిప్రమాదకరమైన అణు ధార్మికతను వెదజల్లే అణు విద్యుత్ కర్మాగారాన్ని కొవ్వాడలో నిర్మించాలని కేంద్రం చూస్తుంది. కానీ స్థానిక ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అటు రణస్థలంలో కొబ్బరి ఉత్పత్తుల పరిశ్రమలు నెలకొల్పాలి. లావేరులో ఫ్లోరైడ్ సమస్య ఎక్కువగా ఉంది.
రాజకీయంగా చూసుకుంటే ఎచ్చెర్లలో కిరణ్ స్ట్రాంగ్‌గానే ఉన్నారు. ఇటీవల స్థానిక ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగిరేలా చేశారు. ఇక టీడీపీ సీనియర్ నాయకుడు కళా వెంకట్రావు పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. ఈ రెండేళ్లలో ఇక్కడ పార్టీ బలోపేతం కాలేదు. మొత్తానికైతే కిరణ్ దెబ్బకు కళా వెంకట్రావుకు రాజకీయ కళ లేకుండా పోయింది.