హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ధర్మానకు మంత్రి పదవి వస్తే?

శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన ఫ్యామిలీ హవా ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే. రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి జిల్లాలో ధర్మాన ప్రసాదరావు, కృష్ణదాస్‌ల ఆధిక్యం ఉండేది. అయితే కాంగ్రెస్ కనుమరుగయ్యాక పరిస్థితి మారింది. దీంతో ఇద్దరు నేతలు వైసీపీలోకి వచ్చి సత్తా చాటుతున్నారు. 2019 ఎన్నికల్లో ధర్మాన కృష్ణదాస్ నరసన్నపేట నుంచి గెలిచి జగన్ కేబినెట్‌లో మంత్రిగా ఉన్నారు. అటు ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం అసెంబ్లీ నుంచి విజయం సాధించి, జిల్లాలో కీలకంగా ఉన్నారు.

ఒకప్పుడు కాంగ్రెస్‌లో కీలక నేతగా ఉన్న ధర్మాన ప్రసాదరావు, అనేకసార్లు మంత్రిగా కూడా పనిచేశారు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. నేదురుమల్లి, కోట్ల, వైఎస్సార్, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్‌లలో పనిచేశారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ కనుమరుగైపోవడంతో, వైసీపీలోకి వచ్చేశారు. 2014 ఎన్నికల్లో శ్రీకాకుళం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి, టీడీపీ అభ్యర్ధి గుండా లక్ష్మీ చేతిలో ఓటమి పాలయ్యారు.

అయితే ఓటమి ఎదురైన వెనుదిరగకుండా కష్టపడి నియోజకవర్గంలో పని చేసుకున్నారు. ఫలితంగా 2019 ఎన్నికల్లో మళ్ళీ ఎమ్మెల్యేగా విజయం సాధించగలిగారు. అయితే ఐదోసారి ఎమ్మెల్యేగా గెలిచినా సరే, ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. ఆయన సోదరుడు ధర్మాన కృష్ణదాస్‌కు మంత్రి పదవి వచ్చింది. అయితే తన సీనియారిటీతో నియోజకవర్గంలో పనిచేస్తున్నారు. మంచి వక్త కావడంతో అటు అసెంబ్లీ గానీ, మీడియా సమావేశాల్లో గానీ టీడీపీకి చురకలు అంటించడంలో ముందున్నారు.

అటు నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. మాజీ మంత్రి కావడంతో అధికారులకు చెప్పి ఏ పనైనా చేయించుకోగలుగుతున్నారు. అయితే జగన్ మళ్ళీ కేబినెట్ విస్తరణ చేస్తే అప్పుడు ధర్మానకు మంత్రి పదవి వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అయితే శ్రీకాకుళంలో సమస్యలు కూడా ఉన్నాయి. రోడ్లు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, తాగు నీళ్లు, సాగు నీరు కొరకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మునిసిపల్ కార్పొరేషన్ స్థాయికి చేరినా, ఆస్థాయి అభివృద్ధి లేదు. గార మండలంలో ఎత్తిపోతల పథకం, బైరీసిగెడ్డ కాలువ పనులు పూర్తయితే తాగు, సాగునీరు అందుతుంది.

అటు టీడీపీ తరుపున గుండా లక్ష్మీ ఉన్నారు. లక్ష్మీ ఇప్పటికీ యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు అండతో నియోజకవర్గంలో పార్టీ బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు. అయితే ధర్మానకు గానీ మంత్రి పదవి వస్తే శ్రీకాకుళం నియోజకవర్గంలో వైసీపీ ఇంకా బలం పడే అవకాశముంది. మరి చూడాలి ధర్మానకు నెక్స్ట్ టర్మ్‌లో మంత్రి పదవి వస్తుందో లేదో?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: