హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: అక్కడ వైసీపీ ఎమ్మెల్యే, టీడీపీ నేత నెగిటివ్‌లోనే ఉన్నారా?
ఎన్‌ఆర్‌ఐ అయిన కడుబండి...మంత్రి బొత్స సత్యనారాయణకు వీర విధేయుడు. ఆయన చొరవతోనే కడుబండికి 2019 ఎన్నికల్లో శృంగవరపుకోట టిక్కెట్ వచ్చింది. రాష్ట్రమంతా జగన్ గాలి ఉండటం వల్ల టీడీపీ కంచుకోటగా ఉన్న ఎస్ కోటలో కడుబండి విజయం సాధించగలిగారు. అయితే తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన కడుబండి నియోజకవర్గంలో అందుబాటులో ఉండటం గగనమని తెలుస్తోంది. ఈయన ఎక్కువగా గజపతినగరంలోనే ఎక్కువ ఉంటున్నారని, ప్రజలకు అందుబాటులో ఉండటం చాలా తక్కువ అని టాక్.
అటు అభివృద్ధి పనుల విషయంలో కూడా చొరవ చూపడం లేదని తెలుస్తోంది. ఏ విధంగా చూసిన ఇక్కడ కడుబండిపై ఎక్కువ నెగిటివ్‌గానే ఉందని అంటున్నారు. కాకపోతే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు, ఇళ్ల పట్టాలు లాంటి కార్యక్రమాలు ప్లస్ అవుతున్నాయి. అటు టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి కుమార్తె శోభా స్వాతీరాణి వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కించుకోవడానికి చూస్తున్నారు. దీంతో కడుబండికి కాస్త ఇబ్బందికర పరిస్తితి ఉంది.
అయితే ఇక్కడ టీడీపీ కూడా వీక్‌గా ఉంది. ఇక్కడ టీడీపీ తరుపున కోళ్ళ లలితకుమారి ఉన్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె, నియోజకవర్గంలో పెద్దగా యాక్టివ్‌గా ఉన్న దాఖలాలు లేవు. ఈ మధ్య కాస్త యాక్టివ్‌గా ఉన్నాసరే ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు వల్ల వైసీపీకి ప్లస్ ఉంది. కాకపోతే టీడీపీ రూట్ లెవెల్‌లో కూడా బలంగా ఉంది. కాబట్టి ఏ పరిస్థితుల్లోనైనా పుంజుకునే అవకాశముంది.