హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: చంద్రబాబు సొంత గడ్డలో చెవిరెడ్డి హవా...
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం...టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం. చంద్రబాబు పుట్టిన నారావారిపల్లె గ్రామం చంద్రగిరి పరిధిలోనే ఉంది. ఇక చంద్రబాబు రాజకీయ జీవితం మొదలైంది కూడా చంద్రగిరిలోనే. 1978 ఎన్నికల్లో చంద్రబాబు చంద్రగిరి నుంచి కాంగ్రెస్ తరుపున బరిలో దిగి విజయం సాధించి, తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. అయితే 1983 ఎన్నికల్లో టీడీపీ ప్రభంజనంలో చంద్రబాబు కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
ఓడిపోయాక చంద్రబాబు టీడీపీలోకి వెళ్ళిపోయారు. ఇక అక్కడ నుంచి ఏం జరిగిందో అందరికీ తెలుసు. అలాగే ఆయన చంద్రగిరి కూడా వదిలేసి కుప్పం నుంచి బరిలో దిగుతూ వరుసగా విజయాలు సాధిస్తూ వస్తున్నారు. అయితే చంద్రగిరిలో మాత్రం టీడీపీ పరిస్థితి దారుణమైపోయింది. 1983, 1983, 1994 ఎన్నికల్లో తప్ప టీడీపీ మళ్ళీ గెలవలేదు. చంద్రగిరిలో మెజారిటీ సార్లు కాంగ్రెస్ పార్టీనే గెలిచింది.
2014, 2019 ఎన్నికలోచ్చేసరికి వరుసగా వైఎస్సార్సీపీ తరుపున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గెలుస్తూ వస్తున్నారు. ఈయన హవా ముందు చంద్రగిరిలో టీడీపీ అడ్రెస్ లేకుండా పోతుంది. పైగా ఇప్పుడు చెవిరెడ్డి అధికార పార్టీ ఎమ్మెల్యే ఉంటూ, నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట పట్టిస్తున్నారు. ప్రభుత్వం నుంచి దాదాపు 228 కోట్ల నిధులు మజూరు చేయించుకుని, నియోజకవర్గంలో పనులు చేయిస్తున్నారు. అటు నియోజకవర్గంలో తాగునీరు, సాగునీరు సమస్యలు లేకుండా చూసుకుంటున్నారు. లాక్ డౌన్ సమయంలో చెవిరెడ్డి తన సొంత డబ్బులని సైతం ఖర్చు పెట్టి పేదలని ఆదుకునే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ పథకాలు ఎలాగో ప్రజలకు అందుతూనే ఉన్నాయి.
పార్టీల పరంగా చూసుకుంటే ఇక్కడ వైఎస్సార్సీపీ బాగా బలంగా ఉందని చెప్పడం కంటే చెవిరెడ్డి స్ట్రాంగ్‌గా ఉన్నారని చెప్పొచ్చు. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన చెవిరెడ్డి తన పనితీరుతో జనాలకు మరింత దగ్గరయ్యారు. అదే సమయంలో టీడీపీలో ఉన్న బలమైన నేతలనీ తనవైపుకు తిప్పేసుకున్నారు. ఇక టీడీపీ నాయకుడు పులివర్తి నాని అంత యాక్టివ్‌గా ఏమి పనిచేయడం లేదు. ఏదో అప్పుడప్పుడు పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళుతున్నారు. స్థానిక సమస్యలపై పెద్దగా పోరాటం చేయడం లేదు. ఇప్పుడున్న పరిస్థితే నెక్స్ట్ నాలుగేళ్ళు కూడా కొనసాగితే ఇక్కడ టీడీపీ గెలుపు చాలాకష్టమని తెలుస్తోంది. మొత్తానికైతే భవిష్యత్‌లో చద్రగిరిలో చెవిరెడ్డికి చెక్ పెట్టడం సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.