హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: నెక్స్ట్ ఆ ఎమ్మెల్యేకు జగన్ మంత్రి పదవి ఫిక్స్ చేసేశారుగా!

కడప జిల్లాలో టీడీపీకి పెద్ద స్కోప్ లేని విషయం తెలిసిందే. ఆ పార్టీ ఆవిర్భావంలో కాస్త ప్రభావం చూపగలిగింది గానీ, తర్వాత మాత్రం వైఎస్ ప్రభావంతో అడ్రెస్ లేకుండా పోయింది. సరే వైఎస్ మరణం, కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోయాక, ఏమన్నా ఛాన్స్ దక్కిందా? అంటే అసలు లేదు. జగన్ పెట్టిన వైఎస్సార్‌సీపీ వేవ్‌లో కొట్టుకుపోయింది. అసలు భవిష్యత్‌లో కూడా కడప జిల్లాలో టీడీపీ గెలవడం చాలా కష్టం. అలా టీడీపీకి భవిష్యత్‌లో గెలుపు అసలు దక్కదనే నియోజకవర్గాల్లో రైల్వేకోడూరు కూడా ఒకటి.

 

ఇక్కడ టీడీపీ నాలుగుసార్లు విజయం సాధించింది. 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధులు గెలిచారు. కడప జిల్లాలో కమ్మ సామాజికవర్గం ప్రభావం ఎక్కువగా ఉన్న నియోజకవర్గం కూడా ఇదే. అందుకే టీడీపీ వరుస విజయాలు అందుకుంది. కానీ ఎప్పుడైతే వైఎస్సార్ హవా మొదలైందో అప్పటి నుంచి టీడీపీ విజయాలకు దూరమైపోయింది. 2004లో కాంగ్రెస్ అభ్యర్ధి గుంటి వేంకటేశ్వర ప్రసాద్ గెలవగా, 2009లో ఎస్సీ రిజర్వడ్‌గా మారడంతో, కోరుముట్ల శ్రీనివాసులు కాంగ్రెస్ తరుపున దిగి విజయం సాధించారు.

 

తర్వాత వైఎస్సార్ మరణం, జగన్ వైఎస్సార్‌సీపీ పెట్టడంతో అందులోకి వచ్చేశారు. కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో 2012లో ఉపఎన్నికలు రాగా, అప్పుడు వైఎస్సార్‌సీపీ తరుపున బరిలో దిగి భారీ మెజారిటీతో గెలిచారు. ఇక 2014లో కోరుముట్ల స్వల్ప మెజారిటీ తేడాతో గెలిచారు. 2019 ఎన్నికలోచ్చేసరికి దాదాపు 35 వేల మెజారిటీతో టీడీపీ అభ్యర్ధి పంతంగాని నరసింహ ప్రసాద్‌పై విజయం సాధించారు.

 

నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలవడంతో కోరుముట్లకు మంత్రి పదవి కూడా వస్తుందని అనుకున్నారు. జగన్ కూడా పదవి ఇవ్వడానికి ఫిక్స్ అయ్యి, కేబినెట్ ఏర్పాటు రోజు అమరావతికి పిలిపించారు. కానీ చివరి నిమిషంలో కొన్ని సమీకరణాల వల్ల కోరుముట్లకు మంత్రి పదవి రాలేదు. పదవి రాకపోయినా సరే, నియోజకవర్గంలో దూకుడుగా పనిచేస్తున్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఇక ప్రభుత్వ పథకాల అమలులో ఎలాంటి లోటు లేదు.

 

అయితే ఏడాది కాలంలో జరిగిన అభివృద్ధి ఏమి లేదు. కాకపోతే కొత్తగా సచివాలయ, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు మాత్రం జరుగుతున్నాయి. అటు పార్టీ పరంగా వైఎస్సార్‌సీపీ చాలా బలంగా ఉంది. ఇక్కడ టీడీపీ తరుపున దివంగత చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ అల్లుడు నరసింహ ప్రసాద్ పనిచేస్తున్నారు. కడప జిల్లాలో మిగతా టీడీపీ నేతలు యాక్టివ్‌గా లేకపోయినా సరే, నరసింహ మాత్రం యాక్టివ్ గా ఉన్నారు.

 

రోజుకో గ్రామంలో పర్యటిస్తూ ప్రజలకు చేరువయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. శివప్రసాద్ మాదిరిగానే విచిత్ర వేషాలు వేస్తూ జనాలకు దగ్గరయ్యే ప్రయత్నాలు ప్రారంభించారు. మొదట్లో జగన్ నవరత్నాలు, మూడు రాజధానుల ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఆయన వేసిన తుగ్లక్ వేషం అందరినీ ఆకట్టుకుంది.  కాకపోతే ఈయన ఎన్ని వేషాలు వేసిన రైల్వే కోడూరు ప్రజలు మాత్రం కోరుముట్ల వైపే ఉన్నారు. భవిష్యత్‌లో కోరుముట్లకు తిరుగులేదనే చెప్పొచ్చు.

 

అయితే నరసింహ కూడా కోడూరు వదిలేసి నెక్స్ట్ చిత్తూరు ఎంపీగా వెళ్లాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. నరసింహ కూడా వెళ్లిపోతే కోడూరులో టీడీపీకి దిక్కు ఉండదు. పైగా నెక్స్ట్ టర్మ్‌లో కోరుముట్ల శ్రీనివాసులుకు మంత్రి పదవి ఖాయమైపోయిందని ప్రచారం జరుగుతుంది. మొదటి విడతలోనే మంత్రి పదవి మిస్ కావడంతో, నెక్స్ట్ మాత్రం జగన్, శ్రీనివాసులుకు పదవి ఫిక్స్ చేసేశారని తెలుస్తోంది. ఇక మంత్రి పదవి కూడా వస్తే కోడూరులో ఆయనకు చెక్ పెట్టడం టీడీపీ వల్ల కాదు. మరీ ఏదైనా అద్భుతం జరిగితే తప్ప కోడూరులో టీడీపీ గెలవలేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: