హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: అక్కడ వైసీపీ ఎమ్మెల్యేతో కలిసి పనిచేస్తున్న టీడీపీ...
2019 ఎన్నికల్లో వైసీపీకి భారీ మెజారిటీ వచ్చిన నియోజకవర్గాల్లో నెల్లూరు జిల్లా సూళ్ళూరుపేట ఒకటి. ఈ నియోజకవర్గం నుంచి కిలివేటి సంజీవయ్య 73336 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయితే సంజీవయ్య రాజకీయ రంగప్రవేశం 2013లో జరిగింది. అంతకముందు వరకు గృహనిర్మాణశాఖలో డిఈగా పనిచేసిన సంజీవయ్య...తన మామ పసల పెంచలయ్య వారసత్వం తీసుకుని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. పసలయ్య సూళ్ళూరుపేటలో 1989లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు.
ఇక సంజీవయ్య 2013లో డైరక్ట్‌గా వైసీపీలో చేరి, 2014 ఎన్నికల్లో సూళ్ళూరుపేట బరిలో నిల్చుని, టీడీపీ సీనియర్ నేత పరసా వెంకట రత్నయ్యపై 3726 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆ ఐదేళ్లు వైసీపీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా కొనసాగిన సంజీవయ్య 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచారు. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన సంజీవయ్య...సాధ్యమైన మేర నియోజకవర్గంలో పనిచేసుకుంటూ వెళుతున్నారు.
కాకపోతే ఈ ఏడాదిలో అనుకున్న మేర అభివృద్ధి ఏం చేయలేదు. కానీ ప్రభుత్వ పథకాలు మాత్రం బాగానే అందుతున్నాయి. అన్నీ పార్టీల వారికి పథకాలు అందుతున్నాయి. ఇక టీడీపీ నేతలు కూడా వైసీపీ ఎమ్మెల్యేకు బాగానే సపోర్ట్ గా ఉంటూ...వారికి కావల్సిన పనులు చేయించుకుంటున్నారు. ప్రతి పనిలోనూ వైసీపీ-టీడీపీ నేతలు మంచి అండర్‌స్టాండింగ్‌తో ముందుకెళుతున్నారు. అయితే పార్టీల పరంగా చూసుకుంటే ఇక్కడ వైసీపీ బలంగానే ఉంది.
అటు టీడీపీ ఇంకా పుంజుకోలేదు. టీడీపీ నేతలు కూడా వైసీపీ ఎమ్మెల్యేకు సపోర్ట్‌గా ఉండటంతో పార్టీ బలపడలేదు. ఇక ఎన్నికల్లో ఓడిపోయిన పరసా వెంకట రత్నయ్యకు వయసు మీద పడటంతో పెద్దగా యాక్టివ్‌గా ఉండటం లేదు. ఇదే సమయంలో మరో టీడీపీ నేత నెలవల సుబ్రహ్మణ్యం వచ్చే ఎన్నికల్లో సీటు దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. దీంతో టీడీపీలో వర్గపోరు ఎక్కువైపోయింది. ఫలితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వైసీపీకి భారీగా సీట్లు దక్కే అవకాశముంది. మొత్తానికైతే సూళ్ళూరుపేటలో వైసీపీ ఎమ్మెల్యే పెద్దగా చేసేది ఏమి లేకపోయినా...సరే పార్టీకు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు.