
హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: బొత్స తమ్ముడుకు తిరుగులేదా? టీడీపీ వీక్ అయిపోయిందా?
2019 ఎన్నికల్లో టీడీపీ ఒక్క సీటు కూడా గెలుచుకొని జిల్లాలో విజయనగరం ఒకటి. జిల్లాలో ఉన్న 9 సీట్లని వైసీపీనే కైవసం చేసుకుంది. అయితే ఎన్నికలై సంవత్సరం అవుతున్నాసరే టీడీపీ ఇంకా పుంజుకోలేదు. ప్రతి నియోజకవర్గంలోనూ టీడీపీ వీక్ గానే ఉంది. ముఖ్యంగా గజపతినగరంలో టీడీపీ పరిస్తితి దారుణంగా ఉంది. మంత్రి బొత్స సత్యనారాయణ తమ్ముడు బొత్స అప్పలనరసయ్య దెబ్బకు టీడీపీ పూర్తిగా చేతులెత్తేసింది.
అయితే బొత్స వెనుక నడుస్తూ కాంగ్రెస్ లో కీలక నాయకుడుగా ఎదిగిన అప్పలనరసయ్య 2009 ఎన్నికల్లో గజపతి నగరం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఇక రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో కూడా ఆయన కాంగ్రెస్ నుంచే పోటీ చేశారు. రాష్ట్రమంతా కాంగ్రెస్‌కు డిపాజిట్లు దక్కకపోయినా సరే, అప్పలనరసయ్య 44 వేల ఓట్లు తెచ్చుకుని సత్తా చాటారు. ఒకవేళ నరసయ్య అప్పుడే వైసీపీలో ఉంటే ఎమ్మెల్యేగా గెలిచేసేవారు.
ఇక కాంగ్రెస్‌తో లాభం లేదని తెలుసుకున్న బొత్స ఫ్యామిలీ తర్వాత వైసీపీలోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో అప్పలనరసయ్య కూడా అన్నతో పాటే వైసీపీలోకి వచ్చి 2019 ఎన్నికల్లో పోటీ చేసి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడుపై అదిరిపోయే విజయం సాధించారు. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన అప్పలనరసయ్య, తనదైన శైలిలో పని చేసుకుంటూ ముందుకెళుతున్నారు. అన్న ఎలాగో మంత్రి కాబట్టి, నిధులకు కొరత ఉండటం లేదు.
ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ముందుంటున్నారు. పార్టీని బలోపేతం చేస్తున్నారు. బలంగా ఉన్న టీడీపీ నేతలనీ తనవైపుకు తిప్పుకున్నారు. పైగా టీడీపీ నేత అప్పలనాయుడులో కుటుంబంలో లుకలుకలు బొత్స తమ్ముడుకు కలిసొస్తున్నాయి. ఎన్నికల సమయంలో అప్పలనాయుడు ఫ్యామిలీ పరోక్షంగా అప్పలనరసయ్యకు మద్ధతు ఇచ్చారు. ఇక ఇప్పటికీ ఆ వివాదాలు అలాగే ఉన్నాయి. దీంతో టీడీపీ పరిస్తితి దారుణంగా ఉంది.
దీని బట్టి చూసుకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ 80 శాతం స్థానాలు గెలవడం ఖాయం. నియోజకవర్గంలో గజపతినగరం, బొండపల్లే, గంట్యాడ, దత్తిరాజేరు, జమి(పార్ట్) మండలాలు ఉన్నాయి. ఈ ఐదు మండలాల్లో వైసీపీ బలంగానే ఉంది. అందుకే గజపతినగరంలో బొత్స తమ్ముడుకు తిరుగులేదనే చెప్పుకోవచ్చు.