హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: మాధవరంకు హ్యాట్రిక్ ఛాన్స్ ఉందా?





 

తెలంగాణలో ఆంధ్రా ప్రజల ప్రభావం ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో కూకట్‌పల్లి కూడా ఒకటి. 2008 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఈ నియోజకవర్గం ఏర్పడింది. ఇక ఆ వెంటనే జరిగిన 2009 ఎన్నికల్లో కూకట్‌పల్లి నుంచి లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ విజయం సాధించారు. ఐదేళ్ల పాటు ఎమ్మెల్యేగా కొనసాగిన జయప్రకాశ్... కూకట్‌పల్లి ప్రజలకు పెద్దగా అందుబాటులో లేరనే చెప్పాలి. ఇక 2014 ఎన్నికలోచ్చేసరికి రాజకీయం పూర్తిగా మారిపోయింది. తెలంగాణ రాష్ట్రం వచ్చింది. దీంతో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి.
పైగా ఇక్కడున్న జనం టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపలేదు. అప్పుడు కూకట్‌పల్లిలో టీడీపీని గెలిపించారు. దాదాపు 43 వేల ఓట్ల భారీ మెజారిటీతో మాధవరం కృష్ణారావు టీఆర్ఎస్‌పై గెలిచారు. అయితే అప్పుడు టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో రాజకీయం పూర్తిగా మారింది. ఒక ఓటుకు నోటు కేసు...టీడీపీని నాశనం చేసేసింది. మొత్తం ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లోకి జంప్ చేసేశారు. మాధవరం కూడా టీడీపీని వీడి టీఆర్ఎస్‌లోకి వెళ్లిపోయారు.
అలా టీఆర్ఎస్‌లోకి వెళ్ళిన మాధవరం...తనదైన శైలిలో పనిచేసుకుంటూ వచ్చారు. 2019 ఎన్నికల్లో ఆయన టీఆర్ఎస్ తరుపున బరిలో దిగగా, టీడీపీ తరుపున నందమూరి సుహాసిని పోటీ చేశారు. అప్పుడు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం చాలామంది టీడీపీ శ్రేణులకు నచ్చలేదు. దీంతో వారు మాధవరంకు మద్ధతు ఇచ్చారు. ఆయన మళ్ళీ 41 వేల ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచేశారు. ఇలా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాధవరం.... కూకట్‌పల్లి ప్రజలకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటారు.
నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు...ఆంధ్రా నుంచి వచ్చి సెటిల్ అయిన జనాలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటారు. అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయిస్తుంటారు. అందుకే కూకట్‌పల్లి ప్రజలు ఇంకా మాధవరం వైపే ఉన్నారు. పైగా ఈయన టీడీపీని గానీ, చంద్రబాబుని గానీ ఎప్పుడు విమర్శించరు. దీంతో ఇక్కడున్న టీడీపీ శ్రేణులు సైతం మాధవరంకే సపోర్ట్ ఇస్తున్నారు.
అంటే ఇప్పటివరకైతే మాధవరంకు పెద్ద వ్యతిరేకత రాలేదనే చెప్పాలి. కానీ నెక్స్ట్ ఎన్నికల్లో రాజకీయం ఎలా ఉంటుందో అర్ధం కావడం లేదు. ఒకవైపు బీజేపీ పుంజుకుంటుంది...మరోవైపు పి‌సి‌సి పగ్గాలు రేవంత్ చేపట్టాక..రాష్ట్రంలో మిగిలిన ఉన్న టీడీపీ శ్రేణులు...ఆయనకు మద్ధతు ఇస్తున్నాయి. ఇలాంటి పరిస్తితుల్లో నెక్స్ట్ కూకట్‌పల్లిలో ట్రైయాంగిల్ ఫైట్ జరిగేలా ఉంది. కానీ కొంతవరకు మాధవరంకు ఎడ్జ్ కనిపిస్తోంది. మరి చూడాలి ఆయన హ్యాట్రిక్ కొట్టగలరో లేదో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: