గూగుల్ క్యాంపస్‌లో ఎమోషనల్ సీన్ తాత-మనవడు బాండింగ్ వైరల్!
సైకిల్ జ్ఞాపకాలు.. గూగుల్ ప్రాంగణం వరకు!
చిన్నతనంలో మనకు నడక నేర్పింది, సైకిల్ తొక్కడం నేర్పింది మన పెద్దవాళ్ళే. మనీష్ సింగ్ కూడా తన తాతయ్య తన చేతులు పట్టుకుని సైకిల్ తొక్కడం నేర్పించిన రోజులను ఎప్పటికీ మర్చిపోలేదు. ఇప్పుడు తాతయ్య ముసలివారయ్యారు, మనవడు గూగుల్ వంటి దిగ్గజ సంస్థలో పెద్ద ఉద్యోగి అయ్యారు. కానీ ఆ ప్రేమాభిమానాలు మాత్రం ఇసుమంతైనా తగ్గలేదు. తన తాతయ్యకు తన పని ప్రదేశాన్ని చూపించాలని మనీష్ ఎప్పటి నుంచో కోరుకున్నారు. ఇటీవల ఆయనను బెంగళూరులోని గూగుల్ క్యాంపస్‌కు తీసుకెళ్ళి, అక్కడ గూగుల్ రంగుల సైకిల్‌పై ఆయనను ఎక్కించి తిప్పారు.ఒకప్పుడు తాతయ్య సైకిల్ తొక్కడం నేర్పిస్తే, ఇప్పుడు మనవడు అదే సైకిల్‌పై తాతయ్యను ఎక్కించుకుని తిప్పుతుంటే ఆ దృశ్యం ఒక సినిమాలోని ఎమోషనల్ సీన్ లా అనిపించింది.
నిజమైన సక్సెస్ అంటే ఇదే!
వీడియోలో తాతయ్య, మనవడు కలిసి క్యాంపస్‌లోని కేఫెటేరియాలో భోజనం చేయడం, పచ్చని లాన్లలో కబుర్లు చెప్పుకోవడం నెటిజన్లను కదిలించింది. “నువ్వు ఏదో ఒక రోజు పెద్ద స్థాయికి చేరుకుంటావు అని నా తాతయ్య చిన్నప్పుడే అనేవారు. నేడు ఆయనను నా ఆఫీసుకు తీసుకెళ్లినప్పుడు ఆయన ముఖంలో కనిపించిన ఆనందం, గర్వం.. నేను సాధించిన అన్ని విజయాల కంటే, నా జీతం కంటే చాలా గొప్పవి.”ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించింది.“మనం ఎన్ని కోట్లు సంపాదించినా మన మూలాలను మర్చిపోకూడదు” అని కొందరు కామెంట్స్ చేస్తుంటే..“నిజమైన విజయం అంటే తాతయ్య కళ్ళలో ఆనందం చూడటమే” అంటూ మనీష్‌ను నెటిజన్లు ఆకాశానికెత్తేస్తున్నారు.
మూలాలను మరువని మనవడు!
నేటి యాంత్రిక జీవనంలో తల్లిదండ్రులను, పెద్దవాళ్ళను పట్టించుకోని వారు ఎందరో ఉన్నారు. అలాంటి వారికి మనీష్ సింగ్ ఒక ‘మాస్’ ఎగ్జాంపుల్ గా నిలిచారు. గూగుల్ టెక్కీగా తన మేధస్సును చాటుకుంటూనే, ఒక మనవడిగా తన బాధ్యతను, కృతజ్ఞతను చాటుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు.