బామ్మ పరుగుకు సోషల్ మీడియా సెల్యూట్..78 ఏళ్ల బామ్మ పరుగు.. 12 గోల్డ్ మెడల్స్‌తో సంచలనం!అ
నెల్లూరు జిల్లా కావలిలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో రామసుబ్బమ్మ వంట మనిషిగా పనిచేస్తున్నారు. రోజూ సాయంత్రం విద్యార్థులు గ్రౌండ్‌లో ఆడుకోవడం చూసి, ఆమెలో కూడా క్రీడల పట్ల ఆసక్తి కలిగింది.78ఏళ్ల వయసులో రన్నింగ్ చేస్తానంటే చాలామంది ఎగతాళి చేశారు. కానీ, తనపై తనకు నమ్మకంతో 2016లో ఆమె తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు.ఇప్పటివరకు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్న రామసుబ్బమ్మ ఏకంగా 12 బంగారు పతకాలు, 8 రజిత పతకాలు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు.అలుపెరగని పరుగు: 500, 800, 1500 మీటర్ల పరుగు పందాలతో పాటు 3000 మీటర్ల నడక పోటీల్లో ఆమె సత్తా చాటుతున్నారు.
రామసుబ్బమ్మ అలుపెరగని పోరాటం గురించి తెలుసుకున్న మంత్రి నారా లోకేష్ ఎమోషనల్ అయ్యారు. ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ బామ్మకు ధైర్యాన్ని ఇచ్చారు. "80 ఏళ్ల వయసులో రామసుబ్బమ్మ గారు సాధిస్తున్న పతకాలు చూసి గర్వంగా ఉంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడాలనుకుంటున్న బామ్మ గారికి ఈ మనవడు లోకేష్ అండగా ఉంటాడు. మీకు ఏ సాయం కావాలన్నా నేను అందిస్తాను" అంటూ ట్వీట్ చేశారు. ప్రభుత్వ పరంగా లేదా వ్యక్తిగతంగా ఆమెకు కావాల్సిన క్రీడా సౌకర్యాలు, ఆర్థిక సాయం అందించేందుకు లోకేష్ సిద్ధమని ప్రకటించడం విశేషం.
రామసుబ్బమ్మ భర్త చనిపోయారు, పిల్లలు వేర్వేరు పనుల్లో బిజీగా ఉన్నారు. కానీ ఆమె మాత్రం ఒంటరిగానే ఉంటూ తన లక్ష్యం కోసం కష్టపడుతున్నారు.రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో గెలిచాను.. ఇప్పుడు నా కన్ను అంతర్జాతీయ పోటీలపై ఉంది. విదేశీ గడ్డపై కూడా పరుగు తీసి భారత్ తరఫున గోల్డ్ మెడల్ సాధిస్తాను అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.వృద్ధాప్యంలో ఇంటికే పరిమితం కాకుండా, సమాజానికి ఒక కొత్త సందేశాన్ని ఇస్తున్న రామసుబ్బమ్మ నిజంగా గ్రేట్!