బ్యాక్ పెయిన్ సమస్యతో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలు పాటిస్తే ఎన్నో లాభాలు!

Reddy P Rajasekhar
ఈ రోజుల్లో చాలా మందిని వేధించే ప్రధాన సమస్యలలో నడుం నొప్పి (బ్యాక్ పెయిన్) ఒకటి. వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఒకప్పుడు పెద్ద వయసు వారికి మాత్రమే వచ్చే ఈ నొప్పి ఇప్పుడు జీవనశైలి మార్పుల వల్ల చాలామందిలో కనిపిస్తోంది. గంటల తరబడి కూర్చుని పనిచేయడం, సరైన భంగిమలో కూర్చోకపోవడం, భారీ వస్తువులను ఎత్తడం, శారీరక శ్రమ లేకపోవడం, సరైన నిద్ర లేకపోవడం, అధిక బరువు, పోషకాహార లోపం వంటివి నడుం నొప్పికి ప్రధాన కారణాలు.

ఈ నొప్పి వచ్చినప్పుడు చాలామంది నొప్పి నివారణ మాత్రలు వేసుకుంటూ తాత్కాలిక ఉపశమనం పొందుతుంటారు. కానీ జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే ఈ నొప్పికి పూర్తిగా చెక్ పెట్టవచ్చు.

ముందుగా సరైన భంగిమలో కూర్చోవడం అలవాటు చేసుకోండి. మీరు ఆఫీసులో పనిచేసేవారైతే గంటకు ఒకసారి లేచి అటూఇటూ నడవండి. ఆఫీసులో కుర్చీకి కూర్చొని ఉన్నపుడు వీపు భాగాన్ని నిటారుగా ఉంచండి. అవసరమైతే వెనుక దిండు పెట్టుకోండి.

శారీరక శ్రమ లేకపోవడం కూడా నడుం నొప్పికి ముఖ్య కారణం. అందుకే రోజూ వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి. ముఖ్యంగా వెన్నుముకకు సంబంధించిన వ్యాయామాలు, కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలు చేయండి. ఉదాహరణకు నడక, యోగా, సైక్లింగ్, ఈత వంటివి మంచి ఫలితాలను ఇస్తాయి. అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గించుకోవడంపై దృష్టి పెట్టాలి. ఎక్కువ బరువు ఉండడం వల్ల వెన్నుముకపై ఒత్తిడి పడి నొప్పి వస్తుంది.

మీరు నిద్రపోయే పద్ధతి కూడా నడుం నొప్పికి కారణం అవుతుంది. సరైన మ్యాట్రెస్ వాడడం, వెల్లకిలా కాకుండా ఒకవైపు తిరిగి పడుకోవడం మంచిది. ఎక్కువ సేపు వెల్లకిలా పడుకోకపోవడం మంచిది. అలాగే క్యాల్షియం, విటమిన్ డి వంటి పోషకాలు పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకోండి. పాలు, పెరుగు, ఆకుకూరలు, చేపలు, గుడ్లు వంటి వాటిని ఆహారంలో చేర్చుకోండి. ఈ చిన్న చిన్న చిట్కాలను పాటించడం ద్వారా నడుం నొప్పిని తగ్గించుకోవచ్చు, అదే విధంగా భవిష్యత్తులో ఈ నొప్పి రాకుండా చూసుకోవచ్చు. ఒకవేళ నొప్పి ఎక్కువగా ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: