ఇక నేడు మన భారత దేశ గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు. ఆయన ఈరోజు 72వ వసంతంలోకి అడుగుపెట్టారు. పలు దేశాధినేతలు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు మన ప్రధానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.కాగా ఆయనెప్పుడూ కూడా ఉల్లాసంగా, ఉత్సాహంగా కనిపిస్తారు. ఇక అలా కనిపించే మోడీ హెల్త్ సీక్రెట్స్ ఏమిటో తెలసుకోవాలని చాలామందికి ఉంటుంది. మరి అవేంటో తెలుసుకుందాం రండి. కాగా దేశ ప్రధానిగా నిత్యం బిజిబిజీగా ఉన్నా తనకంటూ కొద్ది సమయం కేటాయిస్తారు మోడీ. ఏ పనిచేయాలన్నా మొదట ఆరోగ్యంగా ఉండాలన్నది ప్రధాని విశ్వాసం. అందుకే ఆయన ఎప్పుడూ ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. అయితే ఇక్కడ చాలామందిని ఆశ్చర్యపరిచే విషయం ఏమిటో తెలుసా? ఆయన నిద్రపోయే సమయం. సాధారణంగా ఒక మనిషి కనీసం 6 గంటలైనా నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతారు. అయితే మోడీ మాత్రం రోజూ 3.5 గంటలకు మించి నిద్రపోరట.
ఒక ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. అలాగే ఆహారంలోనూ ఎంతో మితంగా ఉంటారట.ఉదయం 5 గంటలకు నిద్రలేచే ప్రధాని 30- 45 నిమిషాల పాటు యోగా చేస్తారట. అలాగే మెడిటేషన్, వాకింగ్‌తో పాటు కొన్ని మార్నింగ్ వర్కౌట్స్ చేస్తారు. ఇక పని ఒత్తిడిని అధిగమించేందుకు క్రమం తప్పకుండా ప్రాణాయామం చేస్తారు. ఇక ఆహారం విషయానికొస్తే.. మోడీ మెనూలో పసుపుతో కూడిన పదార్థాలు తప్పకుండా ఉండాలట. అలాగే పెరుగు కూడా డైట్లో ఉండాల్సిందే. కాగా హిమాచల్‌లో పెరిగే పర్వత పుట్టగొడుగులను తినేందుకు ప్రధాని బాగా ఇష్టపడతారట. మోరెల్ మష్రూమ్ అని పిలిచే వీటిలో ఆరోగ్యానికి మేలు చేసే పలు పోషకాలు ఉంటాయట. ముఖ్యంగా విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. అలాగే ఈ పుట్టగొడుగులు కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయట. రోగనిరోధక శక్తిని పెంచి గుండె జబ్బుల ప్రమాదాన్ని రక్షిస్తాయట.