హ్యాపీ క్రిస్మ‌స్ : దారి త‌ప్పానా నేను!

RATNA KISHORE
ఇష్ట‌మ‌యిన బ‌తుకుని బ‌త‌కాల‌న్న మొండిత‌నం నాలో ఉంది..అని అంటారు ప్ర‌కాశ్ రాజ్ ఎందుక‌లా? ఎవ్వ‌ర‌యినా త‌మ దారిని తామే నిర్మించుకుని త‌మ హ‌క్కును తామే పొంది బాధ్య‌త‌గా ఉండ‌డం దైవాజ్ఞ ఎందుకు కాదు..అవుతుంది. ప్ర‌భువు ఆజ్ఞ మేర‌కు దారి త‌ప్పడం త‌ప్పు కాదు దారి దిద్ద‌డ‌మే బాధ్య‌త..
క్రిస్మ‌స్ పండుగ వ‌చ్చిందంటే చ‌ర్చిల‌న్నీ కొత్త వెలుగుల్లో ఉంటాయి..చ‌ర్చిల‌తో పాటు మ‌నుషులు కూడా ఆ వెలుగుల నీరాజనాల్లో ఉంటారు..మంచు సోన‌ల వేళ మ‌నిషికో బాధ్య‌త గుర్తు చేస్తుంది చ‌ర్చి..ఎవ్వ‌రు ఎంద‌రు మ‌న దారికి భిన్నంగా ఉన్నా కూడా న‌డ‌వడి స‌క్ర‌మం అయితే వెంట వ‌చ్చే శ‌క్తుల‌న్నీ మ‌ద్ద‌తుగా ఉంటాయి. ప్ర‌త్యేక‌మ‌యిన ఆలోచ‌న ఇదే! దారి అంతా ముళ్లున్నాయి అని బాధ‌ప‌డిన తీరే ఆగిపోవ‌డం..ముళ్ల‌ను వ‌ద్ద‌నుకోవ‌డం కూడా త‌ప్పే! భ‌గ‌వంతుడి సృష్టిలో అస‌లు పాఠం అక్క‌డి నుంచే మొద‌లు.. మ‌నం గొంగ‌ళిని ప్రేమించాలి సీతాకోకనూ ప్రేమించాలి..రెండు ద‌శ‌ల మ‌ధ్య జీవితం ఒక గొప్ప సంస్క‌ర‌ణ వాదానికి ప్ర‌తీక.
మ‌నుషులు ఎలా ఉన్నా కూడా నిబ‌ద్ధ‌త‌కు తార్కాణం అయి ఉండాలి..తార‌లు వెలిగే చోట..ప్ర‌భువు రాక ఒక‌టి స్ప‌ష్టం అయి దారుల‌న్నీ కాంతిమంతం అయిన వేళ నిజంగానే జీవితం గొప్ప మార్పును స్వీక‌రించి ఉండాలి. మ‌తాన్నీ,మ‌నిషిని వేరు చేయ‌డంలో అర్థం ఏమీ లేదు. మతం ఆచ‌ర‌ణ..మ‌నిషి ఆ ఆచ‌ర‌ణ‌కు ఆలంబ‌న..ఇప్పుడ‌యినా ఒప్పుకోండి దారుల‌న్నీ అంద‌రివీ అని! అలా అనుకుని ప్ర‌యాణం చేయండి ఓ గ‌మ్యం మీ పేరిట రాసి ఉంటుంది. చేరుకోవ‌డం బాధ్య‌త.
దోసిట చినుకులు అంటూ ప్ర‌కాశ్ రాజ్ (యాక్ట‌ర్ రైట‌ర్) ప‌ల‌క‌రించారు ఓ సారి. క‌న్న‌డ సాహిత్యం ఆయ‌న రాస్తే తెలుగు అనువాదం
ఒక‌రు చేశారు. మన హైద్రాబాద్లోనే ఈ పుస్త‌కం మ‌రింత‌గా వన్నెల‌ద్దుకుంది. ఆ పుస్త‌కంలో తన చిన్న నాట విష‌యం గురించి చెబుతారు ప్ర‌కాశ్ రాజ్..మందలో ఉండే మేక‌పిల్లలు అంటే ఏ ప‌ట్టింపూ ఉండదు భ‌గ‌వంతుడికి అదే దారి త‌ప్పిన పిల్ల ఏమ‌యిపోతుందోన‌ని కాప‌రి త‌న భుజాన వేసుకుని ప్ర‌యాణిస్తాడు అని!..ఇదీ త‌న త‌ల్లి త‌న‌కు చెప్పిన క‌థ ఓ చిత్ర ప‌టం చూస్తూ చెప్పిన క‌థ..చిత్రం చెప్పించిన క‌థ అని రాయాలి..మ‌న జీవితాల్లో కూడా మ‌నం దారి త‌ప్పే ఉన్నాం..ఉంటాం కూడా! ఎద‌గ‌డం ఇత‌రులను ఎద‌గ‌నివ్వ‌డం ఇవ‌న్నీ మంచి దారి నిర్మించే క్ర‌మంలో భాగాలు..అర్ధ భాగాలు కాదు ప‌రిపూర్ణ భాగాలు అని రాయాలి.. ప్ర‌య‌త్నం ప‌రిపూర్ణం అయితే చాలు మంచి ఫ‌లితాలు అవే వ‌స్తాయి..బైబిల్ క‌థ‌ను ఇప్ప‌టికీ స్మ‌రిస్తూ ఉంటూనే ఉంటారు ప్ర‌కాశ్ రాజ్..త‌న దారినీ,గ‌మ్యాన్నీ నిర్దేశించిన నాటి రోజులను త‌లుస్తారాయన.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: