విజయం మీదే: ఇంగ్లీష్ ఇలా ప్రాక్టీస్ చేస్తే విజయం మీ సొంతం
గ్రామీణ , తెలుగు మీడియం విద్యార్థులు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ నైపుణ్యంలో బలహీనంగా ఉంటున్నారు. ఇంగ్లీష్ మాట్లాడే, తప్పులు లేకుండా రాసే సామర్థ్యం లేకపోవడంతో ఉన్నత స్థానాలకు ఎదగలేకపోతుంటారు. కమ్యూనికేషన్ నైపుణ్యాలు కొరవడడం వల్ల ఉపాధి అవకాశాలు పొందలేకపోతున్నారు. ఇంగ్లీష్ అంటే భయపడేవారు మొదట ఆ భయాన్ని పోగొట్టుకోవాలి.
చాలామంది ఇంగ్లీష్ మాట్లాడుతుంటే ఎక్కడ తప్పులు దొర్లుతాయేమోనాని భయపడుతూ ఉంటారు. కొందరు ఇంగ్లీష్ వెంటనే నేర్చేసుకోవాలని క్రాష్ కోర్సులను ఆశ్రయిస్తున్నారు. ఇంగ్లీష్ లో నైపుణ్యాలను పెంచుకోవాలనుకునేవారు మొదట గ్రామర్ పై దృష్టి పెట్టాలి. ప్రతిరోజు ఇంగ్లీష్ పత్రికలు, పుస్తకాలు చదవడం, ఇంగ్లీష్ వార్తా చానళ్లను చూడడం, మనకు తోచిన ఆలోచనలను సొంతంగా రాయడం, బెరుకు లేకుండా ఎక్కువ సమయం ఇంగ్లీష్ మాట్లాడేందుకు ప్రయత్నించడం ద్వారా నైపుణ్యాలను మెరుగుపరచుకోవచ్చు.
ఇంగ్లీష్ లో నైపుణ్యం పెంచుకోవాలనుకునేవారు మొదట నైపుణ్యం ఉన్నవారి సహాయ సహకరాలు తీసుకొని వ్యాకరణ నియమాలు నేర్చుకోవాలి. ప్రతిరోజూ నేర్చుకున్న నియామాలకు సంబంధించిన ప్రశ్నల సాధన చేయాలి. స్నేహితులు, సన్నిహితులతో ఇంగ్లీష్ లో మాట్లాడే ప్రయత్నం చేయాలి. తెలుగులో మాట్లాడే వాక్యాలను ఇంగ్లీష్ లో అనువదించేందుకు ప్రయత్నాలు చేసి ఇంగ్లీష్ నైపుణ్యాలను పెంచుకోవచ్చు. మాట్లాడటంలో, రాయడంలో తప్పులను సరిదిద్దుకుంటూ ప్రాక్టీస్ చేస్తే ఇంగ్లీష్ లో మాట్లడటం పెద్ద కష్టమేమీ కాదు.