
ఈ నాటి కుటుంబం: మంచి చెప్పే అమ్మమ్మలు ఎక్కడ...?
చిన్నప్పుడు ప్రతి ఒక్కరూ పల్లెటూర్లకు వెళ్లి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. స్కూల్లో సెలవులు వచ్చాయంటే చాలు ఇంకేముంది అమ్మమ్మ వాళ్ళ ఊర్లో కి వెళ్లడం అక్కడ పచ్చటి పొలాల్లో మామలు అత్తలు బావ మరదళ్లతో గడపడం అబ్బో ఆ సరదాయే వేరు . ప్రతి ఒక్కరు లైఫ్ లో ఈ తీపి జ్ఞాపకాలు మిగిలే ఉంటాయి. ఎన్ని రోజులైనా చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లి ఎంజాయ్ చేసిన విషయం మాత్రం అసలు మర్చిపోలేము కదా ఎందుకంటే అంతటి మధురానుభూతులు హరివిల్లు ఆనాటి అమ్మమ్మగారిల్లు. పచ్చటి పొలాల్లో తిరుగుతూ అమ్మమ్మ తాతయ్య దగ్గర కొంటే పనులు చేస్తూ... చిన్నప్పుడు తెగ ఎంజాయ్ చేసేవాళ్ళం. స్కూల్ కి సెలవు వస్తే చాలు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి చెక్కేయడం ఒక్కటి మాత్రమే తెలుసు. చిన్నతనంలో అమ్మమ్మగారిల్లు అంటే అది ఒక ఆనందాల హరివిల్లు.
అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లగానే ఎక్కువగా గుర్తొచ్చేది అమ్మమ్మ చెప్పే కథలు.. అమ్మమ్మ మనపై చూపించే ప్రేమ... మనని నిద్ర ఇచ్చేందుకు అమ్మమ్మ ఎన్నో కథలు చెబుతూ ఆమె మేలుకుని మనం పడుకునేంత వరకు కథలు చెబుతూనే బుజ్జగిస్తూ పడుకో పెడుతుంది. ఇక అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము అంటే మనకు కావాల్సిన పిండివంటలు అన్నీ చేసి పెట్టేస్తుంది అమ్మమ్మ. అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నన్ని రోజులు మనకు కావాల్సిన వెరైటీస్ అన్ని తినేయొచ్చు అనుకుంటాం. ఎంతో ప్రేమతో ఎన్నో రకాల పిండివంటలు చేసి పెడుతుంది అమ్మమ్మ. అందుకే ఇప్పటికీ అమ్మమ్మగారిల్లు అంటే మనకు ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక మధుర జ్ఞాపకం.
ఈ మధుర జ్ఞాపకాలు మాత్రం మన జనరేషన్ వరకూ ఆగిపోతాయి అనడంలో అతిశయోక్తి లేదు. మన పిల్లల జనరేషన్ కి మాత్రం అమ్మమ్మగారిల్లు మధురానుభూతులు... తీపి జ్ఞాపకాలు.. కేవలం కలే. ఒకప్పుడు అమ్మమ్మగారిల్లు అంటే ఎంత ఆనందంగా ఉండేది అని మనం మన పిల్లలకు కథలు చెబితే వినడం తప్ప అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తే ఎంత ఆనందంగా ఉంటుందో ప్రత్యక్షంగా చూసే వీలు మాత్రం నేటి జనరేషన్ కు లేదు. ఎంతో ఆప్యాయంగా కథలు చెప్పే అమ్మమ్మ... సరదాగా మనతో పొలాల్లో ఆడుతూ పాడుతూ తిరిగే అత్తమామలు బావ మరదళ్ల సందడి నేటి తరానికి ఒక కల. అసలు నేటి తరంలో అలా ప్రేమగా ఆప్యాయంగా కథలు చెప్పే అమ్మమ్మలు కూడా తక్కువే. అందుకే మన పిల్లల జనరేషన్ కు అమ్మమ్మగారిల్లు ఒక కల లాంటిదే.