మనిషి ప్రవర్తనలో ఈ మద్య వచ్చిన అనేక ప్రతికూల మార్పులు గమనిస్తే అతని మనసులో పెరిగిపోతున్న "కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు" మాత్రమే కారణం. ఈ ఆరు దుర్లక్షణాలను "అరిషడ్వర్గాలు" గా పిలుస్తారు. దీని విస్త్రుత అర్ధం ఏమంటే అరి (శత్రువు) షడ్ (ఆరు) వర్గాలు (రకాలు) మనసును ఆలోచనలను ప్రభావితం చెసే ఆరు శత్రు విభాగాలు లేదా లక్షణాలు అని చెప్పొచ్చు. ఈ మనిషిని ప్రేరేపించే ప్రతికూల అరిషడ్వర్గాలు మనిషిని ఎంతటి నీచ స్థాయికైనా దిగజారు స్తాయి. ఇవి మనిషి పతనానికే కాదు, ప్రకృతి వినాశనానికి దోహదం చెసే ప్రధాన అంశాలు
1.కామం– "కామాతురాణాం న భయం న లజ్జ" అంటే అర్ధమదే. కామం సర్వానర్ధాలకు మూలంకామం అంటే కోరిక లేదా వాంచ ఇది కావాలి, అది కావాలి అని మనిషి పడే తాపత్రయానికి ప్రధాన ఆధార ప్రతికూల లక్షణం. అవసరాలకు మించిన కోరికలు కలిగి ఉండటం. అంతే తాను జీవిస్తే,సుఖిస్తే చాలు అని కాకుండా, తన తరతరాలు ఊహలకు మించిన కోరికలు తీర్చుకోవాలన్న అభిలాష అన్నమాత.
2.క్రోధం – క్రోధం అంటే కోపం, ఆగ్రహం. కోరుకున్న కోరికలు తీరనదుకు కారణాలు తనలోని "కామం" అని గుర్తించకుండా మనసు చింతిస్తుంది. అంతే కాదు తన వాంచలు తీరక పోవడానికి కారణం వెతికి అందుకు ఇతరులు అడ్డుపడటమేనని భావించి వారిపై ప్రతీకారేచ్చ పెంచుకొని రగిలిపోతూ కక్ష పెంచుకొని పగ తీర్చుకోవాలనే ఉద్రేక పూరిత నిర్ణయాలు తీసుకుంటుంది. క్రోధాన్ని అగ్ని తో పోలుస్తారు. ఇది ఉంటే మనిషిని మనసును ప్రకృతిని దహించివేస్తుంది.
3. లోభం – కామ పూరిత వాంచలతో తాను సంపాదించుకున్నదేదైనా, సాధించుకున్నదేదైనా, పూర్తిగా తన స్వంతమని తానే పూర్తిగా అనుభవించాలని భావించడం "లోభం". తన స్వంత మనుకున్నదాంట్లో నుండి పూచిక పుల్ల కూడా పరులెవరికీ దాన, ధర్మాలు చేయకుండా ఉండ టమే లోభం.
ఇది ఒక రకంగా పిసినారి తనం. తను ఎవరికి పంచక తాను అనుభవించక పోవటామే లోభి లక్షణం. సంపద ఏదైనా అనుభవించటానికే కదా!
4. మోహం- కామం ద్వారా సంపాదించినదాన్ని లోభం ద్వారా నిలబెట్టుకొని సాధించుకున్న సంపద ఖచ్చితంగా తనకే...తనకే కావాలి అనుకొని దానిపై విపరీత వ్యాయామం అంటే ప్రతికూల ప్రేమ పెంచుకొనటాన్నే "మోహం" అంటారు. దాన్ని ఇతరులకు పంచని అతి వ్యామోహం గుణం మోహం అన్నమాట.
5. మదం – మదం అంటే అహంకారం పొగరు. తాను మోహం పెంచుకొని తాను స్వంతం చేసుకొని సంపద పెంచుకొని తాను కోరుకున్నవన్నీ నెరవేరితే అదంతా తన గొప్పతనమేనని గర్వించడం. ఇతరులకు ఆ సామర్ధ్యం లేదని వారిని పలచన చేసి చిన్నచూపు చూడటం చివరకు గుర్తించకపోవటం కూడా మదం కిందే లెక్క.
6. మాత్సర్యం - తనకున్న సంపదలు ఇతరులకు ఉండకూడదని, తనకు దక్కనిది ఇతరులకు కూడా దక్కకూడదని, ఒకవేళ తను పొందలేని పరిస్థితిలో ఆ వస్తువు ఉంటే- అది ఇతరులకు కూడా దక్కకూడదని, తనకు ఇష్టమైనది తనకు దక్కని పరిస్థితుల్లో నైనా ఇతరులకు దక్క కూడని భావించే గుణం "మాత్సర్యం" దీన్నే ఈర్ష్య అసూయ అని కూడా అంటారు.