బుడుగు: పిల్లలను కొడితే ప్రమాదం..!

N.ANJI
చిన్న పిల్లలు అల్లరి ఎక్కువగా చేస్తుంటారు. పిల్లల అల్లరితో విసుగు చెందిన తల్లిదండ్రులు వారిని కొడుతూ ఉంటారు. అయితే ప్రతి చిన్న విషయానికి పిల్లలను దండిస్తే.. వారి మానసిక పరిస్థితి, ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం పడుతుందని తాజా అధ్యయనం చెబుతోంది. అయితే మెడికల్ జర్నల్ ‘ది లాన్సెట్’ తాజాగా ‘పిల్లలపై శారీరక దాడి’ అనే అంశంపై చేసిన పరిశోధనలో ఈ వివరాలు తెలిపారు. ఇక ఈ పరిశోధన కోసం దాదాపు 69 దేశాల నుంచి డేటాని సేకరించారు.
తాజా పరిశోధనల ప్రకారం.. పిల్లలను పిరుదులపై కొట్టడం అనేది వారిని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాక.. చిన్నప్పటి నుంచే చిన్నారులను కొడితే బాగుపడతారు అనుకోవడం పెద్ద పొరపాటని అని అంటున్నారు. ఇక వారిని మరింత క్రూరంగా మార్చడంతో పాటు, వారు ఒంటరితనం బారిన పడేలా చేస్తుందని చెప్పారు.
అయితే పిల్లను చిన్నతనంలో కొడితే.. రానున్న రోజుల్లో వారు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారనే అంశంపై ఈ అధ్యయనం సాగుతుందని అన్నారు. తాజా అధ్యయన బృంద సభ్యులు ఎలిజబెత్ గెర్షాఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నతనంలో తరచుగా దండించడం వల్ల పిల్లల్లో కోపం పెరుగుతుందని వెల్లడించారు. ఇక పాఠశాలల్లో వారి ప్రవర్తన సరిగా ఉండదని, ఆ తరువాత వారు సంఘ విద్రోహకులుగా మారే అవకాశం ఉందని తెలియజేశారు. ఇక పిరుదులపై కొట్టడం అనేది అంత మంచిది కాదని, దీనిని నిషేధించడంతో పాటు, ఇందుకు సంబంధించిన నియమాలు, నిబంధనలను పిల్లల చట్టాల్లో చేర్చాలని తాజా నివేదిక వెల్లడించింది.
ఇక కొట్టడం అనే అంశాన్ని పిల్లలు కేవలం హింసగానే చూస్తారని, అది వారి మానసిక ఎదుగుదలలో కీలక పాత్ర పోషించి భవిషత్తులో హింసకు ప్రేరేపిస్తుందని అధ్యయనం తెలిపారు. అంతేకాక అన్ని దేశాలు పిల్లల సంరక్షణకు నడుం బిగించాలని పరిశోధకులు అన్నారు. ‘అంతేకాక ఇంట్లో పిల్లలు అల్లరిచేస్తుంటే కొట్టకండి అని చెబుతున్నారు. అయితే వారికి అర్థమయ్యేలా ప్రేమగా వివరించి చెప్పాలన్నారు.
అంతేకాక.. వారికి ఈ సమాజంలో ఓ మనిషిలా ఎలా నడుచుకోవాలో నేర్పించాలన్నారు. అలాంటి చేయడం వలన వారికి ఎలాంటి సమస్య ఎదురైనా నిలబడి ముందుకెళ్లే వారిలా తీర్చిదిద్దండి అని చెబుతున్నారు. ఇక పరీక్షల్లో తప్పినా, మార్కులు సరిగా రాకపోయినా కొట్టకండి అని అంటున్నారు. అయితే జీవితంలో ఎలా గెలవాలో నేర్పించండి’ అని అధ్యయనం నివేదిక తల్లిదండ్రులకు సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: