బుడుగు: పిల్లలకు స్నానం ఎప్పుడెప్పుడు చేయించాలో తెలుసా..!
అయితే పాపాయి చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే స్నానం ఎప్పుడెప్పుడు చేయాలో తెలుసుకోవాలంటున్నారు న్యూజిలాండ్‌కు చెందిన ప్రముఖ వైద్య నిపుణుడు డాక్టర్ సామ్ హే. స్నానం చేస్తే శరీరంపై ఉండే మృత కణాలు తొలగిపోతాయి. దుర్వాసన దూరమవుతుంది. శ్వేధరంధ్రాలు శుభ్రపడి చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అయితే ఇందుకు మాటిమాటికీ స్నానం చేయడం మాత్రం ప్రమాదకరమని సామ్ హే చెబుతున్నారు.
ఇక నీరు, సబ్బు వల్ల శిశువుల చర్మం పొడిబారుతుంది. దీని వల్ల తామర వంటి చర్మవ్యాధులు, చర్మంపై పొక్కులు, ఇతర ఇన్‌ఫెక్షన్‌లు ఎదురయ్యే అవకాశం ఉంటుందని డాక్టర్ సామ్ తెలిపారు. ఆయన అభిప్రాయంలో వైద్యపరంగా పిల్లలకు ప్రతిరోజూ స్నానం చేయించాల్సిన అవసరం లేదు. రెండు మూడు రోజులకు ఒకసారి స్నానం చేయిస్తే చాలని చెబుతున్నారు.
అయితే పిల్లలకు ఎంత తరచుగా స్నానం చేయించాలనే విషయం వివిధ రకాల అంశాలతో ముడిపడి ఉంటుంది. నివసించే వాతావరణం, శరీర తత్వం, రోజులో పిల్లలు ఎంత సమయం దుమ్ములో ఆడుటుంటున్నారు అనేవి స్నానం చేయించడానికి పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు.
ఈ డాక్టర్ చిన్నారుల స్నానానికి సంబంధించి కొన్ని సలహాలు ఇస్తున్నారు. సబ్బు వాడకాన్ని తగ్గించడంతో పాటు పిల్లల శరీరం తేమను కోల్పోకుండా చూడాలి. సబ్బుకు బదులుగా బాత్ ఆయిల్ వాడటం మంచిది. వాతావరణ పరిస్థితులనూ దృష్టిలో పెట్టుకొని స్నానం చేయించాలి. శీతాకాలంలో చల్లని గాలి శరీరాన్ని పొడిబార్చుతుంది. అందువల్ల తక్కువ సార్లు స్నానం చేస్తూ, శరీరాన్ని తేమగా ఉంచాలి. ఏసీలు ఎక్కువగా వాడినా ఇదే పద్ధతిని పాటించాలి. అందువల్ల వాతావరణం, శరీరతత్వాన్ని బట్టి పిల్లలకు స్నానం ఎన్నిసార్లు చేయాలన్నది నిర్ణయించుకోవడం మంచిది.