బుడుగు: పిల్లలకు మల్టీ విటమిన్లు అవసరమా.. అయితే ఇలా చేయండి..!?
అయితే ఆరోగ్యంగా ఉన్న పసిపిల్లలకు ఎప్పుడూ మల్టీ విటవిన్ ట్యాబ్లెట్లు గానీ, సిరప్‌లు గానీ ఇవ్వకూడదట. తినే ఆహారం నుండి వారి శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను పొందుతారు. మల్టీవిటమిన్లు అనేవి పసిపిల్లలకు కూడా అవసరమే కానీ, అవి కేవలం ఆహారం రూపంలో మాత్రమే వారికి అందాలి. ఇతర ప్రత్యామ్నాయ పద్ధతుల్లో వారికి మల్టీ విటమిన్లను అందించడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
ఇక మీ పిల్లలు వేళకు తింటున్నారా లేదా అని గమిస్తుండాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైన ఉంది. అలాగే వయసుకు తగినంత బరువు ఉన్నారా లేదా అని చూస్తుండాలి. కేవలం తినడం మాత్రమే కాదు.. పోషక విలువలు కలిగిన ఆహారాలు తింటున్నారా లేదా అన్న విషయాలను నిర్ధారించుకోవాలి. ఇవన్నీ పాటిస్తున్నట్లైతే మీ పిల్లలకు ఎలాంటి మల్టీ విటమిన్లు అవసరం లేదు.
డాక్టర్ సూచనలు, సలహాలు లేకుండా పిల్లలకి మల్టీ విటమిన్లు లేదా పోషక పదార్ధాల సప్లిమెంట్లను ఇవ్వకూడదు. ఎందుకంటే అలాంటి సప్లిమెంట్లను అధికంగా తీసుకోవడం సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంది. అలెర్జీలు, దీర్ఘకాలిక వ్యాధుల సమస్యలు ఉన్నవారికి మాత్రమే వైద్యులు మల్టీ విటమిన్లను సిఫార్సు చేస్తారు. కాబట్టి మీ పిల్లలకు పోషకాలన్నింటినీ ఆహారం ద్వారానే అందేలా చూసుకోవడం మంచిది.
ఇక ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం అనేది పిల్లల సరైన పెరుగుదల, అభివృద్ధికి తోడ్పడుతుంది. అలాగే ఇలాంటి ఆహార పదార్థాలు వారి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. పిల్లలు తినే ఆహారంలో విటమిన్లు, ఖనిజాలు, మినరల్లు లాంటివి తప్పనిసరిగా ఉండాలి. అవి పిల్లలను అనారోగ్య బారి నుండి కాపాడుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.