బుడుగు: వ్యాక్సిన్‌లతో ఇమ్యూనిటీ పిల్లల ఆరోగ్యానికి మంచిదేనా..!?
ఇక పిల్లల్లో కూడా రోగనిరోధక శక్తిని పెంచడానికి వ్యాక్సిన్‌లను ఉపయోగించడంవల్ల లాభమే తప్ప నష్టమేమీ ఉండదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే చిన్నారుల పుట్టుక మొదలు కొన్నేండ్లు వచ్చే వరకు వారిలో వ్యాధి నిరోధకతను పెంచడం కోసం ఎన్నో రకాల టీకాలను ఇస్తున్నారు. తట్టు, ధనుర్వాతం, క్షయ, టైఫాయిడ్, గవదబిళ్లలు (టాన్సిల్స్), డిఫ్తీరియా లేదా కంఠ వాతము, పెర్టుసిస్ లేదా కోరింత దగ్గు, పోలియో, హెపటైటిస్ బి, హెపటైటిస్ ఎ, రుబెల్లా, రోటా వైరస్ కారణంగా వచ్చే వ్యాధులను నిరోధించడానికి వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నాయి.
ఇక చిన్నారులతోపాటు, గర్భిణులకు కూడా వ్యాక్సిన్‌లు అవసరం. వ్యాక్సిన్‌లవల్ల కొందరికి తాత్కాలికంగా చిన్నచిన్న సమస్యలు తలెత్తినా దీర్ఘకాలికంగా మంచి ప్రయోజనం ఉంటుంది. మనం తీసుకొనే మందుల లాగే వ్యాక్సిన్లు కూడా కొన్ని ఇబ్బందులు కలిగిస్తాయి. ముఖ్యంగా టీకాలు వేసినపుడు సూచి గుచ్చిన ప్రదేశంలో నొప్పి రావడం లేదా జ్వరం రావడం సహజం. కానీ, ఇలాంటి సమస్యలను చూసి కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలకు టీకాలు వేయాలంటే భయపడుతున్నారు. దాంతో చాలామంది చిన్నారులకు సమయానికి టీకాలు అందట్లేదు.
అయితే సరైన అవగాహన లేకపోవడంవల్లే చాలా మంది పిల్లలకు టీకాలు వేయించట్లేదు. 8 శాతం మంది పిల్లలు అసలు టీకాలే వేసుకోవడం లేదు. అందుకే భారతదేశం చేపట్టిన సంపూర్ణ టీకా కార్యక్రమం విజయవంతం కావాలంటే సరైన అవగాహన కల్పించడమే సరైన పరిష్కారం. ముఖ్యంగా కులం, మతం, ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలకూ టీకాలపై సరైన అవగాహన కల్పిస్తే ఆరోగ్య భారతాన్ని సాధించడం సులువే అవుతుంది.