బుడుగు : పిల్లల ముందు తల్లి తండ్రులు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు.. !!
ఒక్కోసారి మన పిల్లల్ని మనమే నువ్వు చూడ్డానికి బావుండవు. నువ్వు సన్నగా లేదా లావుగా, అసహ్యంగా ఉంటావు లాంటి మాటలు అస్సలు అనకూడదు. ఇది వారిలో అభద్రతాభావాన్ని పెంచుతాయి. ఇలాంటి మాటలు అనడం వల్ల పిల్లలు వాళ్ళ రూపాన్ని తప్ప ఇంక దేని గురించి ఆలోచించలేరు. దీని మూలంగా ఎక్కువ తినడమో, తక్కువ తినడమో చేస్తారు. పిల్లలు వారి రూపాన్నీ, రంగునీ అంగీకరించాలంటే ముందు తల్లిదండ్రులకి అసలు ఆ ధ్యాస ఉండకూడదు. అప్పుడే పిల్లలకి వారు చెప్పగలుగుతారు – ఎలా ఉన్నా వాళ్ళని వాళ్ళు ప్రేమించుకోవాలని. బాహ్య సౌందర్యం కంటే ఆత్మ సౌందర్యం మిన్న అని పిల్లలు అర్ధం చేసుకోగలుగుతారు.
ఇకపోతే చాలామంది తల్లితండ్రులు పిల్లల్ని ఇలా కూడా అంటారు నువ్వు అసలు మాకు పుట్టకుండా ఉంటే బావుండేది, మీ తమ్ముడు నీకంటే పెద్దయ్యుంటే బావుండేది, నాకు అబార్షన్ అయ్యుంటే బావుండేది, నువ్వు అమ్మాయి/అబ్బాయిగా పుట్టి ఉంటే బావుండేది…ఇలాంటి మాటలు వల్ల పిల్లలు మనసు గాయమవుతుంది.అలాంటి పరిస్థితులలో " నేను అనవసరంగా పుట్టాను" అనే భావన పిల్లల మనసులోకి వస్తుంది. ఇది తనకి తాను హాని చేసుకోడానికీ కారణమవుతుంది. అలాగే పిల్లలు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. అందుకనే పిల్లలు తల్లితండ్రులకు ఎంతో స్పెషల్ అనే విషయాన్ని వాళ్ళు అర్ధం చేసుకునేలాగా పేరెంట్స్ ప్రవర్తించాలి.