బుడుగు: పిల్ల‌ల ప‌రీక్ష‌ల‌కు పెద్ద‌లు తీసుకోవ‌ల‌సిన జాగ్ర‌త్త‌లు

Arshu
స్కూలు పిల్లల పరీక్షలు మొదలవబోతున్నాయి. కొంచెం పెద్దవారితో ఫరవాలేదు కానీ పరీక్షల సమయంలో చిన్న పిల్లలతోనే పెద్ద సమస్య. పరీక్షలంటే చాలా టెన్షన్ పడిపోతారు. ఆ టెన్షన్లో పడి తిండి సరిగ్గా తినరు. కొందరైతే ఆదుర్దా పడి జ్వరం కూడా తెచ్చుకుంటారు. కాబట్టి పిల్లల పరీక్షల సమయంలో పెద్దలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే…


 
పరీక్షలు కదా అని అస్తమానం చదవమని పోరు పెట్టకండి. కాసేపు టీవీ చూడనివ్వండి. ఆడుకోనివ్వండి. ఎంత రిలాక్స్ అయితే అంత బాగా చదవగలుగుతారు.  అన్ని మార్కులు రావాలి, ఇన్ని మార్కులు రాకపోతే ఊరుకోను అంటూ ముందే కండిషన్లు పెట్టకండి. వాళ్లు భయపడిపోతారు. ఆ ఒత్తిడితో బాగా రాయగలిగినా కొన్నిసార్లు రాయలేకపోతారు. చదువులో సహాయం చేయండి. ఎలా చదవాలి, ఎలా గుర్తు పెట్టుకోవాలి వంటి విషయాలను వారితో చర్చించండి. 

 వీలైనంత వరకూ ఇంటిని ప్రశాంతంగా ఉండనివ్వండి. ఎటువంటి గొడవలు, డిస్టర్బెన్సెస్ లేకుండా చూసుకోండి. లేదంటే పిల్లలు డైవర్ట్ అయిపోతారు. టెన్షన్ పడి తిండి తినమంటే బలవంతపెట్టకండి. అలా అని పోనీలే అని వదిలేయకండి. నచ్చజెప్పి కడుపు నిండా తినేలా చూడండి. టీ కాఫీల వంటివి ఇవ్వకండి. వేసవి కాలం కాబట్టి రాగి జావ వంటివి తాగిస్తే దాహం వేయకుండా ఉంటుంది. పరీక్షలన్నాళ్లూ మాంసాహారం దూరంగా ఉంచండి. అంతగా కావాలని గొడవ చేస్తే చేపలు పెట్టండి. వాటిలో ఉండే ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్ నాడీ మండల పనితీరును మెరుగుపరుస్తాయి. దాంతో మెదడు ఉత్తేజితమై చదివింది బాగా గుర్తుపెట్టుకుంటారు.

 డ్రైఫ్రూట్స్ ఎక్కువగా పెట్టండి. హార్మోన్ల పని తీరు మెరుగై పిల్లలు హుషారుగా ఉంటారు. తద్వారా ఏకాగ్రత పెరుగుతుంది. అలాగే పాలు, పండ్లు, గుడ్డు కచ్చితంగా పెట్టండి. గుడ్డు తినటానికి ఇష్టపడకపోతే అరటిపండు పెట్టండి. పరీక్షకు వెళ్లేటప్పుడు మంచినీళ్లు తప్పకుండా ఇచ్చి పంపండి. పరీక్ష హాల్లో ఉన్నా సమయం సరిపోదనే భయంతో కొన్నిసార్లు వాళ్లు తాగకపోవచ్చు. కాబట్టి దగ్గరే నీళ్లు ఉంటే తాగడానికి వీలుగా ఉంటుంది. పరీక్షకు తీసుకెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు పిల్లలకు మరీ ఎండ ఎక్కువ తగలకుండా చూడండి. వడదెబ్బ తగిలితే పెద్దవాళ్లే తట్టుకోలేరు. ఇక పిల్లలైతే పరీక్షలు రాయలేని పరిస్థితి ఏర్పడవచ్చు. కాబట్టి కచ్చితంగా జాగ్రత్త తీసుకోండి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుని చూడండి. ఏ ఇబ్బందీ లేకుండా, ఎటువంటి టెన్షనూ పడకుండా మీ పిల్లలు పరీక్షలు చక్కగా రాసేస్తారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: