కురుక్షేత్ర యుద్దానంతరం పంచపాండవులు అశ్వమేథయోగం జరిపి బీదలకు అపారమైన దనధర్మాలు చేశారు. జనమంతా ఆ యాగ వైభవాన్ని, గొప్పతనాన్ని చూసి ఆశ్చర్యంలో అలాంటి యాగం లోకం ఇంతవరకూ కనీవినిఎరగదన్నారు.
యాగం ముగిసాక ఒక ముంగిస అక్కడికి వచ్చింది. దాని శరీరం సగం బంగారు వన్నెతో సగం గోదుమ వన్నెతో ఉన్నది. అది యజ్ఞమంటపంలో అటూ ఇటూ పొర్లసాగింది. తన చుట్టూవున్న జనంతో అది ‘‘ మీరంతా అసత్యనాధులు, ఇది ఒక యజ్ఞమే కాదు’’ అంది. ఆ మాటలకు జనం ఇలా అన్నారు.
‘‘ ఏమిటీ ? ఇది యజ్ఞమే కాదా ? ధనం నగలు బీదల కెలా ధారాపాతంగా కురిపింపబడ్డాయో, అందరూ ఎలా భాగ్యవంతులై, సుఖవంతులై ఉన్నారో నీకు తెలియదా? మానవుడు నిర్వర్తించిన యాగంలో ఇది మహాద్భుతమైనది.‘‘ అందుకు ఆ ముంగిన ఇలా అంది, ‘‘ఒకప్పుడు గ్రామ ముండేది, అందులో ఒక పేదబ్రాహ్మణుడు తన భార్యతో, కొడుకుతో కోడలితో నివసించేవాడు.
వారు నిరుపేదలు. అతడి భోధనలకు, ఉపదేశాలకు గ్రామస్తులు సమర్పించే స్వల్పమే వారి జీవనానికి ఆధారం. ఇలా వుండగా ఆ దేశంలో మూడు సంవత్సరాలు వరుసగా కరువు సంభవించింది. అందువల్ల ఆ పేదబ్రాహ్మణుడు ఎప్పటికంటే మరింత కష్టపడసాగాడు. రోజులకొద్ది ఆ కుటుంబం పస్తుండగా ఒకనాటి ఉదయం తండ్రి ఎలాగో అదృష్టవశాన కొంత బియ్యపు పిండి సంపాదించి, దానిని నాలుగు భాగాలు చేసి నలుగురికీ పంచాడు. వాళ్లు దానిని ఉడికించి తినబోయేంతలో ఎవరో తలుపు తట్టారు.
తండ్రి తలుపు తెరవగానే వాకిట్లో ఒక అతిథి నిలబడి ఉన్నాడు. భారతదేశంలో అతిథి అంటే పుణ్యమూర్తి- అతడిని దైవంగా భావించి పూజించాలి. కాబట్టి ఆ బీదబ్రాహ్మణుడు ‘‘స్వాగతం, లోపలికి రండి’’ అంటూ అతిథిని ఆహ్వానించి తనవంతు ఆహారాన్ని అతడికి సమర్పించాడు.. అతడు దాన్ని ఆవురావున తినేసి ‘‘చంపారండీ’’ బాబూ! పది రోజులనుండి పస్తున్న నా కీ రవ్వంత పిండి నా ఆకలిని మరింత పెంచింది.’’ అన్నాడు.
ఆ మాటలు విని భార్య భర్తతో తన వంతు ఆహారాన్నికూడా అతడికి సమర్పించమనగా, భర్త అంగీకరింపకపోయేసరికి ఆమె యిలా అంది. ‘‘ఇతడు పాపం ఇక్కడకు వచ్చాడు. ఈతడి ఆకలి తీర్చటం గృహస్థులమైన మన కర్తవ్యం కదా ! ఇతడికి యివ్వడానికి మీ వద్ద ఏమీ లేదు కాబట్టి నా వంతు ఆహారాన్ని సమర్పించటం భార్యనైన నా విధి,’ ఇలా అంటూ ఆమె తన వంతును అతిథికి సమర్పింది. అతడు దాన్నీ తినేసి ‘‘ ఆకలితో మాడిపోతున్నాను’’ అన్నాడు.
బాధగా బ్రాహ్మణుడి కుమారుడు అప్పడు ‘ నా వంతునూ స్వీకరించడి; తండ్రి బాధ్యతలను నిర్వర్తించటం కుమారుడి విధి కథా’’ అంటూ తన వంతును కూడా అతిథికి ఇచ్చేశాడు. అతిథి దాన్ని తినీ తృప్తిపడలేదని గ్రహించిన కోడలు తన బాగాన్ని నిస్సంకోచంగా సమర్పించింది. అది తిని ఆ అతిథి తృప్తిపడి వారిని దీవించి వెళ్లిపోయాడు. ఆనాటి రాత్రి ఆ కుటుంబంలోని నలుగురు ఆకలిబాధతో మరణించారు.
ఆ బియ్యపుపిండి కణాలు కొన్ని నేల మీదపడ్డాయి. వాటి మీద నేను దొర్లగానే నా శరీరంలో సగం మీకు కనిపిస్తూన్న సువర్ణమయమైంది. అలాటి యజ్ఞాన్ని మరొక దానిని కనుగొనడానికి ఆనాటి నుండి నేను లోకమంతా తిరుగుతున్నాను. కాని ఇంతవరకూ నాకు కనబడలేదు. నా శరీరం రెండవ పక్క మరెక్కడా సువర్ణమయం కాలేదు. నేను దీన్ని యజ్ఞమే కాదనటానికి కారణం,
ఇదే‘‘! నీరు తామరాకును తడపనట్టు స్వార్థరహితుడైన వ్యక్తికి ఫలసంగాన్ని కల్పించి కర్మ అతణ్ణి బంధించలేదు. నిస్సంగుడు, స్వార్థరహితుడు ఐన వ్యక్తి పాపసంకిలం, జనాకీర్ణం ఐన నగర మధ్యంలో నివసిస్తున్నాకూడా అతణ్ణి పాపం అంటలేదు. దానం చెయ్యటానికి మీకు అవకాశంఇచ్చిన దానంపట్టేవారిపట్లే మీరు కృతజ్ఞులై వుండండి. పూర్తి స్వార్థరాహిత్యం అంటే ఇదే.
మరింత సమాచారం తెలుసుకోండి: