రంగాపురంలో రాముడనేవాడు చిన్నాచితకా దొంగతనాలు చేస్తూండేవాడు. రాత్రివేళల్లో ఇళ్లల్లోకి చొరబడి అందినంత మేరకు దోచుకునేవాడు. అప్పుడప్పుడు పట్టుబడి గ్రామస్థుల చేతుల్లో దెబ్బలు తినేవాడు. జైల్లో ఉంచినా, విడుదల కాగానే దొంగతనాలకు పాల్పడేవాడు.
ఒక రోజు రాముడి కన్ను రాజయ్య మాస్టారి ఇంటి మీద పడింది. ఆయనంటే ఆ ఊరిలో అందరికీ గౌరవం. ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆయన్నే సలహా అడిగేవారు. ఊళ్ళో పిల్లలందరికీ పగటిపూట; పెద్దలందరికీ రాత్రిపూట వీధి అరుగు మీదనే చదువు చెబుతుండేవారు ఆయన.
వాళ్ళిల్లు ఎప్పుడు చూసినా సందడి సందడిగా ఉంటుంది. ఆ ఇంట్లో దొంగతనం చేస్తే బాగా డబ్బు దొరుకుతుందని భావించాడు రాముడు. ఓరోజు రాత్రి వాడు చాకచక్యంగా పెరటిగోడ దూకి, మాస్టారి ఇంట్లోకి ప్రవేశించాడు.
చీకట్లోనే ఇల్లంతా తడుముకుంటూ వెదికాడు- ఎక్కడా విలువైన వస్తువులు కానీ, డబ్బుగానీ దొరకలేదు. ఏవో కొన్ని వంటపాత్రలు, అలమారల నిండా పుస్తకాలు తప్ప, వేరేవేమీ లేవు ఆ యింట్లో...రాముడికి ఆశ్చర్యం వేసింది- "ఛ, ఛ. నేను పడ్డ శ్రమంతా వృధా అయిపోయింది" అని తిట్టుకుంటూ బయటికి వెళ్ళబోయాడు.
గడపకు ఈవతలే కాలికేదో తట్టుకున్నది- తూలిపడ్డాడు. ఆ అలికిడికి మేలుకున్నారు మాస్టారు- "ఎవరదీ?" అని దీపం వెలిగించారు. పారిపోదామనుకున్న రాముడు ఆగాడు- "మాస్టారు ఏం చేస్తారులే!" అన్న ధీమాతో "నా పేరు రాముడు. దొంగతనానికి వచ్చాను, ఇంట్లో ఏమీ లేదు. ఎలా బతుకుతు-న్నావయ్యా?!" అన్నాడు అసహనంగా.
మాస్టారు కొంచెం సేపు మాట్లాడలేదు. అటుపైన "ఒక్క నిమిషం ఆగు" అంటూ తలదిండు క్రిందనుంచి పది రూపాయల నోటు తీసిచ్చారు- ప్రస్తుతానికి ఇది ఒక్కటే ఉంది, నీకు పనికొచ్చేది- నెల మొదట్లో వచ్చి ఉంటే కొన్ని ఎక్కువ డబ్బులు దొరికేవేమో" అన్నారు ప్రశాంతంగా. రాముడు ఆయన చేతిలోంచి ఆ నోటును లాక్కున్నాడు. "ఏమీ వెనకెయ్యలేదా?" అడిగాడు. "నాకు ఎక్కువ డబ్బు అవసరం లేదు. నలుగురికీ జ్ఞానం పంచుతున్నానన్న తృప్తిచాలు.
నేనంటే ఊరి వాళ్లకి చాలా గౌరవం. తెల్లవారుతున్నది- ఇంకొంచెం సేపట్లో ఎవరో ఒకరు వస్తారు. నిన్నిట్లా చూశారంటే చావబాదుతారు. వెంటనే జాగ్రత్తగా వెళ్లిపో!" అన్నారు మాస్టారు, వాడిని బయటికి నెట్టుతూ. ఒక్కక్షణం రాముడికి కళ్లంట నీళ్లు తిరిగాయి. "డబ్బుల పరంగా చూస్తే, నిజానికి తన పరిస్థితి మాస్టారికంటే చాలా మెరుగు .. కానీ మాస్టారి బ్రతుకులో నిండా వెలుగు ఉంది- తనది మాత్రం చీకటి బ్రతుకు !" ఆలోచించిన కొద్దీ రాముడికి సిగ్గు అనిపించింది.
"మాస్టారూ! అన్నీ ఉన్నా గౌరవంగా బ్రతకలేకపోతున్నాను. మిమ్మల్ని చూశాక నా తప్పేంటో తెలుసుకున్నాను. ఇకపై దొంగతనాలు చేయను. కష్టపడి బతుకుతాను" అంటూ మాస్టారికి నమస్కరించి, మారిన మనిషిగా ఇంటిదారి పట్టాడు.
మరింత సమాచారం తెలుసుకోండి: