సీ. ఆర్. ఆర్ విద్యాసంస్థల చరిత్ర గురించి తెలుసా

D.V.Aravind Chowdary
పశ్చిమగోదావరి జిల్లా కేంద్రంలోని ప్రముఖ విద్యా సంస్థ సీ.ఆర్.ఆర్ విద్యాసంస్థలు గురించి చెప్పుకుంటూ పోతే ఎంతైనా చెప్పుకోవచ్చు. ఇక్కడ చదువుకున్న ఏంతో మంది విద్యార్థులు ఈరోజు సమాజంలో అనేక ఉన్నత స్థానాల్లో ఉన్నారు. 1945 లో చిన్న విద్యాలయంగా ఏర్పడి తర్వాత కాలంలో అనేక విద్యాసంస్థలు గా విస్తరించింది. ఇటీవలే ఈ విద్యా సంస్థల వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వీటి చరిత్రలోకి ఒక సారి తొంగి చూద్దాం పదండి. 




1940 దశకం వరకు ఈ జిల్లాలోని విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు వైజాగ్, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు లేదా  చెన్నై  ప్రాంతాలకు వెళ్లేవారు. అందువల్ల పూర్తి స్థాయి వసతులతో కూడిన ఉన్నత విద్యా కళాశాల అవసరం ఏర్పడింది.




ఈ విషయాన్ని ముందుగా గమనించిన భీమవరం పట్టణ ప్రముఖలు తమ ప్రాంతంలో కళాశాల ఏర్పాటు కు తమ వంతు ప్రయత్నాలు సాగించారు. కానీ అప్పటి ఆంధ్రా యూనివర్సిటీ వైస్ ఛాన్సులర్ గా ఉన్న, ప్రముఖ విద్యావేత్త సర్ సీ. ఆర్.రెడ్డి లేదా సర్ కట్టమంచి రామలింగారెడ్డి గారు మాత్రం జిల్లా కేంద్రమైన ఏలూరు లోనే పూర్తి స్థాయి వసతులతో కూడిన కళాశాలను ఏర్పాటు చేయడానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఏలూరు లో ఏర్పాటు చేసేందుకు కావల్సిన అనుమతులు ఇచ్చేందుకు సిద్ధం అని కూడా పేర్కొన్నారు.




1944 లో అప్పటి ఏలూరు పురపాలక సంఘం అధ్యక్షుడు గా ఉన్న రావు సాహెబ్ దామరాజు వెంకటరావు గారు మరియు ఏలూరు పట్టణ ప్రముఖులు కలిసి కళాశాల ఏర్పాటు కోసం భూమిని సేకరించడమే కాకుండా దాతల సహకారంతో కళాశాలకు భవనాలు ఏర్పర్చారు. కళాశాల ప్రారంభించడానికి సర్ సీ.ఆర్.రెడ్డి గారే ఏలూరు వచ్చి  ప్రారంభించారు. 

 


ఏలూరులో కళాశాల ఏర్పాటుకు ఆయన చేసిన సహాయానికి గుర్తుగా సీ.ఆర్.రెడ్డి కళాశాలగా నామకరణం చేశారు. దామరాజు వెంకటరావు గారి అధ్యక్షతన ప్రముఖ విద్యావేత్త డీ.ఎస్.సుబ్రహ్మణ్యం గారి ప్రధానాచార్యుడిగా వారి ఇరువురి ఆధ్వర్యంలో రెండో గ్రేడ్ కళాశాలగా పనిచేయడం ప్రారంభమైన ఈ సంస్థ విద్యాదాత అల్లూరి బాపినీడు గారి సహకారంతో ఈ విద్యాసంస్థలు ఆర్థికంగా పరిపుష్టం అయ్యాయి. 



1957 నుంచి ప్రీ యూనివర్సిటీ కోర్సు, 1958 నుంచి డిగ్రీ కోర్సు, 1960లలో ప్రీ యూనివర్సిటీ రద్దు కావడంతో దాని బదులుగా వచ్చిన ఇంటర్మీడియట్ కోర్సు, 1969 లో మూడు సబ్జెక్టుల అనుబంధాలతో  ప్రారంభించిన డిగ్రీ కోర్సు, 1971లో పీజీ కళాశాల స్థాపించి పీజీ కోర్సులు ప్రారంభించారు. 



1980లో సాంకేతిక విద్యకు ప్రాధాన్యం ఇస్తూ పాలిటెక్నిక్ కళాశాల, 1984 లో బీఈడీ మరియు పబ్లిక్ స్కూల్ , 1987 లో మహిళా డిగ్రీ , పీజీ కళాశాల , 1989 లో ఇంజినీరింగ్ మరియు జూనియర్ మహిళా ఇంటర్మీడియట్ కళాశాలు, 2007 లో ఫార్మసీ కళాశాల, 2018లో నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేశారు. ఈ విద్యాసంస్థల్లో ప్రత్యేక గ్రంథాలయాలు , వసతి గృహాలు, భారీ క్రీడా మైదానాలు ఉన్నాయి.




ఏంతో మంది విద్యావేత్తలు , విద్యాదాతల సహకారంతో అభివృద్ధి చెందిన సీ. ఆర్.ఆర్ విద్యాసంస్థలకు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉంది. జాతీయ సాంకేతిక విద్య సంస్థ ఇప్పటికే మూడు సార్లు నాక్ - ఏ గ్రేడు లభించాయి. ఈ విద్యా సంస్థలు ఏర్పడిన నాటి నుండి నేటి వరకు సుమారు 60 వేల మంది విద్యార్థులు వివిధ కోర్సుల్లో డిగ్రీలు పూర్తి చేశారు.




వంద ఎకరాల విస్తీర్ణంలో ఏలూరు నుంచి వట్లూరు దాకా విస్తరించి ఉన్న ఈ సంస్థల్లో  బోధన సిబ్బంది 600, బోధనేతర సిబ్బంది 350 మంది పనిచేస్తున్నారు. ప్రస్తుతం 14,500 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: