భారత్ లో తొలి కేసు.. ఆ మహమ్మారి వచ్చేసింది?

praveen
చైనా వైరస్ లు ప్రపంచం మీద కక్ష కట్టినట్టు కనిపిస్తోంది అని కొంతమంది విశ్లేషకులు అనుమానిస్తున్నారు. అవును, నిజమే అనిపిస్తుంది. దాదాపు మూడు సంవత్సరాల క్రితం చైనాలో పురుడు పోసుకున్న కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎలా అతలాకుతలం చేసిందో ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. కరోనా సృష్టించిన మారణ హోమంలో ప్రపంచవ్యాప్తంగా అనేకమంది మరణించిన సంగతి తెలిసిందే. ఇంకా ఎక్కడో ఒకచోట కరోనా గాయాలు చేస్తూనే ఉంది. ఇంకా దాన్ని మరిచిపోక ముందే ఇప్పుడు మరో వైరస్ దాడికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. గత కొన్ని రోజుల నుండి చైనా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న హెచ్ఎంపివి వైరస్ ఇప్పుడు భారతీయులను కూడా టార్గెట్ చేసినట్టు కనబడుతుంది.
మీరు విన్నది నిజమే. ఈ హెచ్ఎంపివీ వైరస్ కేసు ఒకటి మన దగ్గర నమోదైనట్టు వార్తలు వస్తున్నాయి. బెంగళూరు లోని ఎనిమిది నెలల పిల్లాడికి హెచ్ఎంపివి పాజిటివ్ అయినట్టు సమాచారం అందుతుంది. సదరు చిన్నారికి జలుబు, జ్వరం, శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తగా స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది. ఈ క్రమంలో చేసిన టెస్టుల కారణంగా ఆ చిన్నారికి హెచ్ఎంపివి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయమై తాజాగా తమకు సమాచారం అందినట్లు కర్ణాటక ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. హెచ్ఎంపివి అనగా... హ్యూమన్ మెటాన్యుమో వైరస్. అయితే ఈ వైరస్ పాజిటివ్ అని తేలిన ఆ చిన్నారి విదేశాలకు వెళ్లకపోవడం గమనార్హం.
అయితే, ప్రస్తుతం చైనా పరిస్థితి చూసి ప్రపంచ దేశాలన్నీ అలర్ట్ అవుతుండడం పరిపాటిగా మారింది. ఆ జాబితాలో భారత్ కూడా ఉంది. ఈ విషయమై భారత్ లో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని చెక్ చేసుకుంటున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదే విషయమై నిన్న శనివారం తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేయగా తాజాగా ఏపీ సర్కారు కూడా హెల్త్ అడ్వైజరీ రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో హెచ్ఎంపీవీ కేసులు లేవని ఏపీ పబ్లిక్ హెల్త్ , ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగం డైరెక్టర్ డాక్టర్ పద్మావతి తెలపడం గమనార్హం. ఏపీలోనే కాదు ... మొత్తం ఇండియాలోనే ఎక్కడ కూడా హెచ్ఎంపీవీ కేసులు నమోదు కాలేదని చెప్పడం జరిగింది. ఈ తరుణంలోనే తాజా బెంగుళూరు కేసు పలు అనుమానాలకు దారి తీస్తోంది. అయితే చైనాలో వ్యాపిస్తున్న ఆ వైరస్ గురించి ఏపీ వాసులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. అయితే ముందు జాగ్రత్త చర్యలుగా రాష్ట్ర ప్రజలు బయటకు వెళ్ళేటప్పుడు మాస్కులు పెట్టుకుని వెళితే సురక్షితంగా ఉండొచ్చు అని చెప్తున్నారు. అదే సమయంలో చిన్నపిల్లలు, పెద్ద వయసు వారు జలుబు, జ్వరం వంటి సమస్యలతో బాధపడితే నిర్లక్ష్యం చేయవద్దని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: