ఆన్లైన్ ఎడ్యుకేషన్ సంస్థ అయిన బైజూస్ తీవ్రమైన నష్టాల ఊబీలో కూరుకుపోయింది. ఇక తాజాగా 4వేల 588 కోట్ల రూపాయల నష్టాలు ఉన్నట్లు ఆ సంస్థే స్వయంగా ప్రకటించింది.బైజూస్ ఆర్థిక ఫలితాల ప్రకటన అనేది దుమారం రేపుతోంది. బైజూస్ సంస్థ, దాని కార్యకలాపాల నిర్వహణ తీరుపై గత కొద్ది రోజులుగా జాతీయ మీడియాలో ఫుంఖానుఫుంఖాలుగా కథనాలు వెలువడ్డాయి. తాజాగా బైజూస్ ప్రకటించిన నివేదికలో అనేక రెడ్ మార్క్స్ ఉన్నాయంటూ పలు బిజినెస్ న్యూస్ పేపర్లు మొదటి పేజీ బ్యానర్ ఐటమ్‌గా ఇచ్చాయి. మరోవైపు తాము విడుదల చేసిన ఆర్థిక ఫలితాల్లో ఎలాంటి తప్పులు చూపలేదంటూ బైజూస్ సీఈవో రవీంద్రన్ సమర్థించుకునే ప్రయత్నం చేశారు.ఆర్థిక కార్యకలాపాల నిర్వహణ అస్తవ్యస్తంగా, గోల్‌మాల్‌గా ఉందంటూ బైజూస్ సంస్థపై గతంలోనే ఆరోపణలు వచ్చాయి. అలాంటి సంస్థతో జగన్ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం విమర్శలపాలైంది. జగన్ సమక్షంలో ఏపీ ప్రభుత్వం, బైజూస్ సంస్థ మధ్య ఇటీవలే ఒప్పంద సంతకాలు జరిగాయి. నాలుగు నుండి పదో తరగతి వరకు వేల రూపాయల విలువైన కంటెంట్‌ను బైజూస్ ఉచితంగా అందజేస్తుందని ఆ సందర్భంగా ప్రకటించారు. బైజూస్ సంస్థ కంటెంట్ విద్యార్థులకు అందుబాటులో ఉండేందుకు వందల కోట్లు ఖర్చు చేసి ట్యాబ్‌లు కొనుగోలు చేశారు.
వేల కోట్లు నష్టాలు చవిచూస్తూ, ఆర్థిక ఆరోపణలు ఉన్న సంస్థతో జగన్ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడంపై ఇప్పటికే ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తాయి.తాజాగా బైజూస్ ఆర్థిక ఫలితాల ప్రకటనపై విశ్లేషణలు జాతీయ మీడియాలో ప్రముఖంగా రావడంతో వైసీపీ నేతల్లో కలవరపాటు మొదలైంది. తాము ఒప్పందం చేసుకున్న సంస్థ గురించి మీడియాలో కథనాలు రావడంతో కంగారుపడ్డ విజయసాయిరెడ్డి.. రంగంలోకి దిగారు. బైజూస్‌ను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు.ప్రపంచంతో పోటీపడేలా ఏపీ విద్యార్థులను తీర్చిదిద్దాలనే సీఎం జగన్ ఆశయమని, అందులో భాగంగానే ప్రభుత్వం స్కూళ్లలో చదివే పిల్లలకు టెక్నాలజీ ఆధారిత నైపుణ్యమైన విద్య అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు విజయసాయి సపోర్ట్ చేశారు. బైజూస్ కంటెంట్ ఉచితంగా ఇచ్చేందుకు 606.18 కోట్ల ఖర్చుతో 4లక్షల 72 వేల మంది విద్యార్థులకు, 64.46 కోట్లతో 50వేల 194 మంది ఉపాధ్యాయులకు ట్యాబ్‌లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కో విద్యార్థికి 36వేల 843 రూపాయల విలువైన ట్యాబ్, బైజూస్ కంటెంట్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. బైజూస్‌కు సపోర్ట్ ఇస్తూ సోషల్ మీడియాలో విజయసాయి పోస్టులు పెట్టడం విమర్శలకు తావిస్తోంది.