ఇంటర్‌ ఆన్‌లైన్‌ అడ్మిషన్ నోటిఫికేషన్ల కొట్టివేత అందుకేనా!

N.Hari
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియెట్‌ కోర్సులకు ఆన్‌లైన్ అడ్మిషన్లు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం నోటిఫికేషన్ జారీ చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాలను ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో చేర్చారు. ప్రకాశం, నెల్లూరుతో పాటు కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాలను ఎస్వీ యూనివర్సిటీ ఏరియా పరిధిలోకి తీసుకువచ్చింది. ఈ పరిధిలో స్థానికంగా ఉన్న వారికి 85 శాతం అడ్మిషన్లు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి 15 శాతం అడ్మిషన్లు ఇచ్చేలా ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేశారు.
సాధారణంగా గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని కార్పొరేట్, రెసిడెన్షియల్ కళాశాలల్లో రాయలసీమ, ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన విద్యార్థులు అత్యధికంగా ఇంటర్ విద్యను అభ్యసిస్తుంటారు. పైగా ప్రస్తుత విద్యా సంవత్సరానికి కళాశాలలు అడ్మిషన్లను పూర్తి చేశాయి. రాయలసీమ, ఉత్తరాంధ్ర విద్యార్థులు వచ్చి గుంటూరు, విజయవాడ నగరాలలో చేరిపోయారు. ఈ దశలో ప్రభుత్వం ఆన్‌లైన్ అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల చేయడంతో తీవ్ర గందరగోళానికి దారి తీసింది. దీనిపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఎవరు ఎక్కడైనా చదువుకోవచ్చని, ఆన్‌లైన్ అడ్మిషన్లు చేపట్టి ఆయా జిల్లాల్లో రిజర్వేషన్లు వర్తింపచేయడం నిబంధనలకు విరుద్ధమని వాదించారు. ప్రభుత్వం అందరినీ సంప్రదించిన తర్వాతనే అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల చేశామని వాదించింది. గత ఏడాది కూడా ఇదే సాకుతో ఆన్‌లైన్ అడ్మిషన్లు జరగకుండా చేశారని విద్యాశాఖ తరపున న్యాయవాదులు వాదించారు.
ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్‌లో అడ్మిషన్లు నిర్వహించాలని ఇచ్చిన నోటిపికేషన్‌ను కొట్టి వేసింది. గతంలో మాదిరిగా ఈ ఏడాదికి అడ్మిషన్లు నిర్వహించాలని ఆదేశించింది. వచ్చే ఏడాదికి విద్యార్దులు, వారి తల్లిదండ్రులు, కళాశాలల యాజమాన్యాలు, అధ్యాపకుల అభిప్రాయాలను తీసుకున్న తర్వాత ఆన్‌లైన్ అడ్మిషన్లు నిర్వహించాలని హైకోర్టు సూచించింది. ఈ ఏడాదికి యథావిధిగా పాత పద్దతిలోనే అడ్మిషన్లు నిర్వహించుకునే విధంగా కళాశాలలకు స్వేచ్చ ఇవ్వాలని ప్రభుత్వాన్ని, ఇంటర్ బోర్డును హైకోర్టు ఆదేశించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: