ఉపాధ్యాయ వృత్తి మసక బారుతుందా..?

MOHAN BABU
భారతరత్న,భారతదేశ తొలి ఉప రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆయన పుట్టిన రోజైన సెప్టెంబర్ 5ను ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం. భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ సెప్టెంబర్ 5వ తేదీన జన్మించారు. ఆయన ఒక గొప్ప ఉపాధ్యాయుడిగా పేరుగాంచారు. ఎంతో మంది విద్యార్థులకు చదువు చెప్పి వారిని గొప్ప ప్రయోజకులుగా తీర్చిదిద్దారు. అలాగే ఆయన ఉత్తమ ఉపాధ్యాయుడిగా పేరుగాంచారు. అందుకనే ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు ఆయన లా ఉండాలనే విషయాన్ని తెలియజేయడం కోసమే ప్రతి ఏటా ఆయన జయంతి రోజున ఉపాధ్యాయుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. మన సంస్కృతిలో గురువుకి చాలా గొప్ప స్థానం ఉంది. మాతృదేవోభవ,పితృదేవోభవ, ఆచార్యదేవోభవ  అని అన్నారు పెద్దలు. తల్లిదండ్రుల తర్వాత అంతటి వారుగా గురువు కీర్తించారు వారు. గురువు అనే పదానికి ప్రత్యేకమైన అర్ధముంది. గు అంటే చీకటి రు అంటే తొలగించు అని అర్ధం.

అజ్ఞానమనే చీకటిని తొలగిస్తాడు కాబట్టి గురువు అనే పేరు స్థిరపడిపోయింది. మనం పుట్టినప్పటి నుండి జీవితంలో స్థిరపడే వరకు ప్రతి దశలోనూ ఉపాధ్యాయుడు ముద్ర ఎంతైనా ఉంది. దేవుడు గురువు పక్క పక్కనే ఉంటే నేను మొదట గురువుకే నమస్కరిస్తాను అన్నాడు మహానుభావుడు కబీర్ దాస్. ఎందుకంటే ఆయన భగవంతుడు అని మొదట తనకు చెప్పింది గురవే కాబట్టి అని వివరించారు. సమాజంలో గురువుకు ఉన్న స్థానం అంత గొప్పది . మనం ఏ దేశాన్ని అయినా యోగ్యమైన రీతిలో నిర్మించాలి అనుకుంటే అత్యుత్తమమైన సామర్థ్యం ఉన్న వారు స్కూల్ టీచర్లు గా ఉండాలి. ఒక పిల్లవాడు తన జీవితంలో మొదటి పదిహేను సంవత్సరాల్లో ఎటువంటి ప్రభావాలకు లోనవుతున్నాడు అన్నది అతని జీవితంలో ఎన్నో విషయాలను నిర్ణయిస్తుంది.

 కాబట్టి ఉన్నత శ్రేణికి చెందిన మేధావులు అత్యుత్తమమైన, నిబద్ధత కలిగి ఎంతో ఉల్లాసంగా, స్ఫూర్తిమంతంగా ఉండే వ్యక్తులు ఉపాధ్యాయులుగా ఉండాలి. కానీ ఈ రోజుల్లో మనం సామాజిక,ఆర్థిక పరిస్థితులను ఎలా నిర్మించుకున్నాం అంటే ఎక్కడా పని దొరకని వారు స్కూల్ టీచర్లు గా వస్తున్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. ఇది మారకపోతే మనం నాణ్యమైన సమాజాన్ని నిర్మించలేము. మనం తక్కువ స్థాయి మానవాళిని, తక్కువ స్థాయి సమాజాలను,తక్కువ స్థాయి దేశాలను నిర్మిస్తాం. ఇది ఇప్పటికే జరుగుతోంది. చాలా స్కూళ్లలో ఉత్తేజితులైనా టీచర్లు చాలా కొద్దిమంది మాత్రమే ఉంటున్నారు. ఇది ఒక ఉద్యోగం గా మారిపోయింది.అవసరమైతే కాస్త ఎక్కువ శ్రమ పడటానికి ఎవరూ సిద్ధంగా లేరు. ఈ విషయంలో మనం తీవ్రంగా విఫలమయ్యాం. ఉత్సాహవంతులైన టీచర్లు చాలా తక్కువగా ఉన్నారు. తల్లి లేదా తండ్రి తప్పు చేస్తే కేవలం ఆ కుటుంబం మాత్రమే నష్టపోతుంది. కానీ అదే ఒక గురువు తప్పు చేస్తే ఆయన విద్యార్థులు అందరూ నష్టపోతారు. మనం ఈరోజు ఎంత గొప్ప స్థాయిలో ఉన్న మనకు చదువు చెప్పి ఉన్న, ఉన్నతికి సహాయపడిన గురువులను మర్చిపోలేము. అందుకేనేమో మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు ఒకసారి హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన వీణ నేర్చుకున్నా టీచర్ గారిని వేదిక మీదికి పిలిపించి సన్మానించారు. అయితే మిగతా దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో గురువులకు ప్రాముఖ్యత అంతగా లేదనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ అధ్యాపకులకు హోదా, జీతభత్యాలు గుర్తింపు అభివృద్ధి చెందిన  దేశాల్లో మాదిరిగా ఉండవు. ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులను మినహాయిస్తే ప్రైవేట్ విద్యాసంస్థల్లోని అధ్యాపకులకు కనీస వేతనం కూడా దొరకడం లేదు.

కోవిడ్ కారణంగా గత 18 నెలలుగా మూతపడిన విద్యాసంస్థల్లో ని సిబ్బంది ఉపాధి కోల్పోయి కూలీలుగా మారిన సందర్భాలు కోకొల్లలు. విద్యా సంస్థలు  ప్రారంభమైన విధులకు హాజరు కావడం లేదు.కారణం ఉద్యోగ భద్రత లేకపోవడం, వేతనాలు చెల్లించకపోవడం, శక్తికి మించిన పని, పనికి తగ్గ ఆదాయం లేక పోవడం, లాక్డౌన్ లో యాజమాన్యాలు పట్టించుకోకపోవడం లాంటి చాలా కారణాలు ఉన్నాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఉపాధ్యాయ వృత్తి చరిత్రగా మిగిలిపోతుందేమోనన్న   సందేహం కలుగుతుంది. పాలకులు ఇప్పటికైనా ఈ సమస్యపై దృష్టి సారించి ఉపాధ్యాయ వృత్తికి ఉన్నత చదువులు చదివిన యువత ఆకర్షించబడేలా విధానాలు రూపొందించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: