4 పాఠాలు చదివితే చాలు.. టెన్త్ క్లాస్ పాస్..

Deekshitha Reddy
కరోనా కష్టకాలంలో గతేడాది ఆల్ పాస్ అంటూ విద్యార్థులందరికీ బంపర్ ఆఫర్ ప్రకటించాయి ప్రభుత్వాలు. ఈ ఏడాది పాఠశాలలు సరిగా జరగకపోవడంతో పరీక్షల విషయంలో పూర్తిగా పద్ధతి మార్చాయి. ఇటీవల టెన్త్ క్లాస్ పరీక్ష పత్రాల సిలబస్, నమూనా ప్రశ్నా పత్రాలను విడుదల చేసిన తెలంగాణ విద్యాశాఖ విద్యార్థులపై వరాల జల్లు ప్రకటించింది.

నాలుగు పాఠాలు చదివితే టెన్త్ పాస్ అయినట్టే..
తెలంగాణ విద్యాశాఖ ప్రకటించిన వివరాల ప్రకారం.. ఇప్పటికే సిలబస్ ను 70శాతానికి కుదించారు. అంటే 30శాతం పాఠాలు అస్సలు చదవక్కర్లేదు, వాటినుంచి ప్రశ్నలు రావు. ఇక మిగిలిన 70శాతం పాఠాలనుంచి ఎగ్జామ్ పేపర్ లో 50శాతం ఛాయిస్ అమలు చేస్తున్నారు. అంటే ప్రతి రెండు ప్రశ్నల్లో ఒకదానికి మాత్రమే ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఛాయిస్ లో ఛాయిస్ ఉన్నా కూడా జాగ్రత్తగా ప్రణాళిక వేసుకుంటే కేవలం 35శాతం సిలబస్ చదివి పదిలో ఫుల్ స్కోర్ ని టార్గెట్ చేయొచ్చనమాట. ఉదాహరణకు 10వ తరగతి బుక్ లో మొత్తం 10 పాఠాలు ఉంటే.. కేవలం 4 పాఠాలు చదివితే చాలు 100 శాతం మార్కులు సాధించేలా పరీక్షను అటెప్ట్ చేయొచ్చు.

బిట్ పేపర్ తో మరింత సులువు.
ప్రతి ప్రశ్నపత్రం పార్ట్‌-ఎ, పార్ట్‌-బిగా ఉంటుంది. సైన్స్‌లో తప్ప మిగిలిన అయిదు సబ్జెక్టులకు పార్ట్‌-ఎకి 60 మార్కులు, పార్ట్‌-బికి 20 మార్కులు కేటాయించారు. పార్ట్‌-ఎలో మూడు సెక్షన్లు ఉంటాయి. ప్రతి సెక్షన్‌లో సగం ఛాయిస్‌ ఉంటుంది. అంటే నాలుగు ఇస్తే రెండు రాయాలి. అదే సమయంలో మార్కులను రెట్టింపు చేశారు. ఒక మార్కు ప్రశ్నలను రెండు మార్కులుగా, రెండు మార్కులవి నాలుగుగా, నాలుగువి ఎనిమిది మార్కుల ప్రశ్నలుగా మార్చారు.  పార్ట్‌-ఎలో 1, 2, 3 సెక్షన్లు ఉంటాయి.
 సెక్షన్‌-1లో గ్రూప్‌-ఎ, గ్రూప్‌-బి అనే రెండు భాగాలుంటాయి. ప్రతి గ్రూపులో ఆరు ప్రశ్నలిస్తారు. అందులో మూడింటికి సమాధానాలు రాయాలి. ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు.  సెక్షన్‌-2లో మొత్తం ఎనిమిది ప్రశ్నలిస్తారు, వాటిలో నాలుగింటికి ఆన్సర్ చేయాలి. ప్రతి సమాధానానికి 4 మార్కులు. సెక్షన్‌-3లో ప్రతి ప్రశ్నకు 8 మార్కులు ఉంటాయి. పార్ట్‌-బిలో బిట్ పేపర్ లో ప్రశ్నలకు అరమార్కు ఉండేది. ఇప్పుడు ఒక మార్కు కేటాయించారు. ప్రశ్నపత్రం 80 మార్కులు. 3.15 గంటల్లో సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఇలా తెలంగాణలో పదో తరగతి పరీక్షల్ని పూర్తిగా సులువుగా మార్చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: