దేశవ్యాప్తంగా వాళ్లకు మాత్రమే స్కూళ్లు ప్రారంభం.. కేంద్రం జోన్ ప్లాన్ ఇదే..!!
కరోనా వైరస్ లేదా కోవిడ్-19.. ప్రపంచదేశాలను అతలా కుతలం చేస్తోంది. పెద్దన్నగా చెప్పుకునే అగ్రరాజ్యం అమెరికా సహా.. ఐరోపా దేశాలకు ఈ విపత్తు ఊపిరి సలపనివ్వడం లేదు. చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైరస్‌కు ప్రస్తుతం వ్యాక్సిన్ లేకపోవడంతో.. కరోనాను కట్టడి చేయడం కత్తి మీద సాములా మారింది. అయినప్పటికీ ప్రపంచదేశాలు విశ్వప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. అయితే కరోనా నివారించేందుకు పలు దేశాలతో పాటు భారత్‌లోనూ లాక్డౌన్ విధించడంతో.. రెస్టారెంట్ల నుంచి హెయిర్ సెలూన్ల దాకా అన్నీ మూతపడ్డాయి. ఈ క్రమంలోనే విద్యాసంస్థలు క్లోజ్ అవ్వడంతో పాటు పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి.
అయితే ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో వాయిదా పడిన పరీక్షలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తుంది. దీంతో దేశవ్యాప్తంగా స్కూళ్లు ఎప్పుడు తెరుచుకుంటాయి? అన్న ప్రశ్న విద్యార్థులను ఇటు తల్లిదండ్రులను, టీచర్లను వేధిస్తున్నాయి. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా స్కూళ్లు రీఓపెన్ పై కేంద్రం ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ప్రధానంగా... జోన్లను బట్టీ... ఏయే స్కూళ్లలో ఎలాంటి రూల్స్ ఉండాలన్నది ఓ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ఇక కరోనా నేపథ్యంలో మూతబడ్డ స్కూల్స్ జూలైలో తెరిచే అవకాశముందని సమాచారం. అయితే ముందుగా స్కూళ్లు తెరిచాక 8 నుంచి 12వ తరగతి విద్యార్థులను మాత్రమే ముందుగా స్కూళ్లకు అనుమతిస్తారని తెలుస్తోంది.
ఎందుకంటే.. ఒకటి నుంచి ఏడో తరగతి విద్యార్థులు చిన్న వయసు వారు కావడంతో తరగతి గదుల్లో, పాఠశాల ఆవరణలో పిల్లలు భౌతిక దూరాన్ని పాటించడం కష్టం కాబట్టి వారికి ఇప్పట్లో స్కూల్స్ తెరిచే అవకాశం లేదని తెలుస్తోంది. మరియు చిన్నారులకు కరోనా సోకితే ఎక్కువ ప్రమాదం కాబట్టి... వాళ్ల విషయంలో మరింత ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నట్లు తెలిసింది. అలాగే దేశంలోని కరోనా ప్రభావిత రెడ్ జోన్, ఆరెంజ్ జోన్, గ్రీన్ జోన్లో ఒక్కో చోట ఒక్కోలా స్కూళ్ల ప్రారంభం ఉంటుందని తెలిసింది. ముందుగా గ్రీన్, ఆరెంజ్ జోన్లలో స్కూళ్లనే తెరుస్తారని సమాచారం.
ఇక స్కూల్స్ తెరిచాక పాటించాల్సిన రూల్స్ ఏంటంటే.. కొన్ని రోజులపాటు ప్రార్థనలు ఆపేయాలి. రెండు షిఫ్టుల్లో తరగతుల నిర్వహణ జరగాలి. టీచర్లు ముఖానికి మాస్కులు, చేతులకు గ్లౌజ్‌లను ఖచ్చితంగా ధరించాలి. ప్రతి స్కూల్లో థర్మల్ స్క్రీనింగ్ వ్యవస్థ ఉండాలి. భౌతిక దూరం వంటి నియమాలు పర్యవేక్షించేందుకు సీసీటీవీ ఉండాలి. ఇక ముగ్గురు కూర్చునే బల్లపై ఇద్దరు విద్యార్థులు మాత్రమే కూర్చోవాలి.