అవినీతి + దౌర్జన్యం + కమీషన్లు + కబ్జాల్లో హీరో.. ప్రజాసేవలో జీరో ఆ టీడీపీ ఎమ్మెల్యే...!
ఉమ్మడి అనంతపురం జిల్లాలో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ ప్రజా ప్రతినిధి తీరుపై నియోజకవర్గ ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది. అంతకుముందు ఉన్న తెలుగుదేశం మాజీని కాదని గత ఎన్నికల్లో చంద్రబాబు ఈయనకు సీటు ఇచ్చారు. నియోజకవర్గ ప్రజలకు ఆయనెవరో తెలియకపోయినా చంద్రబాబు మీద నమ్మకంతో గెలిపించారు. అసలు ఓ బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా హుందాగా ఎలా ఉండాలో తెలియని సదరు ప్రజాప్రతినిధి బుద్ధిలో వీధి రౌడీలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు తీవ్రంగా ఉన్నాయి. సొంత పార్టీకే చెందిన వీరాభిమానులు.. చివరకు ఆయన గెలుపు కోసం అహర్నిశలు కష్టపడిన వారు సైతం ఎందుకు గెలిపించాం రా బాబు అని తలలు బద్దలు కొట్టుకుంటోన్న పరిస్థితి. కేవలం 20 నెలలకే ఇంత తీవ్రమైన వ్యతిరేకత కొని తెచ్చుకున్న సదరు ప్రజా ప్రతినిధి ఇప్పుడు ఎన్నికలు పెడితే కనీసం 30 వేల ఓట్ల తేడాతో చిత్తుగా ఓడిపోవడం ఖాయమని నియోజకవర్గంలో ఓ మోస్తరు రాజకీయ పరిజ్ఞానం ఉన్న సగటు మనిషి కూడా చెపుతోన్న మాట.
అసలు నెక్ట్స్ టిక్కేట్టే రాదు అని చెపుతోన్న పార్టీ కార్యకర్తల సంఖ్య అయితే వందల్లోనే ఉంది. సదరు ప్రజా ప్రతినిధి అవినీతి, బూతు పురాణాలు తిట్టడంలో, తనకు తానే పెద్ద హీరోలా ఫీలవ్వడంలో మేటి.. ప్రజా సేవలో జీరో అన్న టాక్ వచ్చేసింది. ఈ 20 నెలల కాలంలో నియోజకవర్గంలో జరుగుతోంది ? ఏంటన్నది పరిశీలిస్తే దౌర్జన్యాలు, భూకబ్జాలు మామూలు. కాస్త ఖరీదైన ఖాళీ స్థలం కనిపిస్తే సదరు ప్రజా ప్రతినిధి అనుచరులు వాలిపోతారు. డబుల్ రిజిస్ట్రేషన్లతో అయినా ఆక్రమించేస్తారు. ఎవరైనా ఇళ్లు కట్టుకోవాలంటే చిన్న ఇళ్లు అయినా రు. 2-3 లక్షలతో మొదలు పెట్టి రు. 5 లక్షలు ఆ పైన కప్పం కట్టాల్సిందే అన్న టాక్ నియోజకవర్గంలో బాగా స్ప్రెడ్ అయిపోయింది. ప్రజా ప్రతినిధి అనుచరులకు కప్పం కట్టకపోతే అక్కడ టీడీపీ వాళ్లు అయినా, వైసీపీ, కమ్యూనిస్టు వాడు అయినా ఇళ్లు కోసం ఒక్క ఇటుక పేర్చడం అసాధ్యం. వాడు పేదోడైనా, పెద్ద ఉద్యోగి అయినా, ఎంత పెద్ద రాజకీయ నాయకుడు అయినా కప్పం విషయంలో రాజీ ఉండదు. చివరకు సదరు ప్రజా ప్రతినిధి గెలుపు కోసం కష్టపడిన పార్టీ నేత అయినా కప్పం కాస్త తగ్గుంతుందే తప్పా కట్టాల్సిందే.. ఈ విషయంలో ఆయన నో కాంప్రమైజ్. అసలు ఆ నియోజకవర్గ చరిత్రలో గతంలో ఎంతో మంది ప్రజాప్రతినిధులు రకరకాల పదవులు చేపట్టారు. ఇంత అరాచకం ఎప్పుడూ చూడలేదని జనాలు తలలు పట్టుకుంటున్నారు.
ఆయన, ఆయన అనుచరులు చేసింది తప్పైనా ఒప్పైనా నియోజకవర్గ జనాలు తల వంచుకుని సలాం కొట్టాల్సిందే.. అందుకు ఎస్ అనాల్సిందే.. కాదు కూడదు అంటే ఆయన బూతు పురాణం లంకించుకుంటారు.
అది ల్యాండ్ సెటిల్‌మెంట్ అయినా, లిక్కర్ షాపులు అయినా, కమీషన్ల బాగోతం అయినా ఆయన గ్యాంగ్ బెదిరింపులు మాత్రం కామన్ అయిపోయాయి. ఇక మద్యం షాపుల విషయానికి వస్తే అక్కడ టెండర్ వేసి షాపులు దక్కించుకున్న వారు షాపులు ఇచ్చేయాలి.. లేకపోతే ఆయన చెప్పినంత కమీషన్ కట్టుకోవాలి. కాదు కూడదు అని చేస్తే ఆ షాపును తగలబెట్టేందుకు కూడా వారు వెనుకాడరు. ఇక నియోజకవర్గంలో వ్యాపారాలు చేసుకునే వారిది అదే పరిస్థితి.
ఇప్పటికే సదరు ప్రజా ప్రతినిధి తీరుతో నియోజకవర్గంలో టీడీపీ భారీ మైనస్‌లోకి వెళ్లిపోయింది. ఇక్కడ పార్టీ పరంగా గతంలో ఉన్న మరో నేతను చేజేతులా పక్కన పెట్టి పార్టీ తీవ్రంగా నష్టపోయిందని టాక్ జిల్లా అంతటా బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే పార్టీకి బలమైన మద్దతుతో ఉండే కమ్మ సామాజిక వర్గమే ఇతడు మాకొద్దు బాబోయ్ అని దండం పెడుతోందంటే పరిస్థితి ఎంత దిగజారిపోయిందో తెలుస్తోంది. ఇక టీడీపీకి పట్టుగొమ్మలైన బీసీలు, తాజా సంఘటనలతో మైనార్టీలు సైతం టీడీపీకి దూరం జరుగుతున్నారు. సదరు ప్రజాప్రతినిధి అవినీతి, దందాలపై ఇప్పటికే పార్టీ పెద్దలకు రిపోర్టులు పలుమార్లు వెళ్లాయి. వినకపోతే ఇప్పటికిప్పుడు చేసేదేం లేకపోయినా ఆయన వన్ టైం విక్టరీతో సరిపెట్టుకునేందుకు సిద్ధమైపోవాల్సిందే.
9490520108.. ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ నియోజకవర్గాల్లో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి. రెండు రాష్ట్రాల్లో నియోజకవర్గాల వారీగా సమస్యలు, ఎమ్మెల్యేల పనితీరు, వారు ఇచ్చిన హామీలు, ప్రజల ఇబ్బందులు, అక్కడ అధికార, ప్రతిపక్ష పార్టీల పరిస్థితులు, రాజకీయ అంశాలపై కూడా మీ అభిప్రాయం మాతో పంచుకోండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.