క‌విత ఎపిసోడ్ మొత్తం కేసీఆర్ స్క్రిఫ్టేనా..?

RAMAKRISHNA S.S.
భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)లో జరుగుతున్న పరిణామాలపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒకే ప్రశ్న వినిపిస్తోంది. ఇదంతా కేసీఆర్ స్క్రిప్ట్ కాదా? కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసి, ఆమెతోనే హరీష్ రావుపై ఆరోపణలు చేయించడం వెనుక కూడా కేసీఆర్ వ్యూహమేనని చాలామంది అనుమానిస్తున్నారు. దీనికి కారణాలు కూడా తక్కువ కావు. ఒకవైపు హరీష్ రావు ఇమేజ్‌ను దెబ్బతీసి ఆయనను పార్టీ నుంచి దూరం చేయడం, మరోవైపు భవిష్యత్తులో బీజేపీతో విలీనం దిశగా అడుగులు వేయడం వంటి అంశాలన్నీ కేసీఆర్ మాస్టర్‌ప్లాన్‌లో భాగమని భావిస్తున్నారు. ఇదే సందేహాలు కొంద‌రు వ్య‌క్తం చేస్తున్నారు. హరీష్ రావు బీఆర్‌ఎస్‌లో కీలక నేత. పార్టీ స్థాపననాటి నుంచి ఆయనే పెద్ద ఎత్తున నేతలను, క్యాడర్‌ను సమన్వయం చేశారు. ప్రతి జిల్లాలో ఆయనకున్న నెట్‌వర్క్ గట్టి పునాది. రేపు తేడా వస్తే పార్టీ కార్యకర్తలలో సగం మంది ఆయన వెంట వెళ్తారన్నది వాస్తవం. చాలా కాలంగా ఆయనను మెదక్ జిల్లాకే పరిమితం చేసినా, కేటీఆర్‌కు ఇంకా పూర్తి గ్రిప్ రాలేదు.


పైగా కేటీఆర్ ధోరణితో కొంతమంది నేతలలో వ్యతిరేకత పెరిగింది. ఈ నేపథ్యంలో హరీష్ ఇమేజ్‌ను దెబ్బతీయాలనే ప్రయత్నం మొదలైందని చెబుతున్నారు. కవితే ఆ పని చేయడానికి సరైన వ్యక్తి అన్నట్టుగా రంగంలోకి దించారు. ఆమె ఆరోపణల తర్వాత సోషల్ మీడియాలో హరీష్ ఆర్థిక స్థితిపై తీవ్ర చర్చలు మొదలయ్యాయి. ఇలాంటివి ముందుముందు మరింత పెరుగుతాయని కూడా బీఆర్ఎస్ వ‌ర్గాల్లోనే ప్ర‌చారం న‌డుస్తోంది. ఇక బీజేపీతో విలీనం అంశం మరో చర్చనీయాంశం. బీఆర్‌ఎస్ భవిష్యత్ కష్టమని కేసీఆర్ అంచనా వేస్తున్నారని సమాచారం. బీజేపీతో బలవంతంగానో, లేక వ్యూహాత్మకంగానో విలీనం జరిగే అవకాశం ఉందని అంటున్నారు. అలాంటి పరిస్థితి వస్తే, కేసీఆర్ రిటైర్ అవ్వాల్సి రావచ్చు.


కేటీఆర్‌ను మాత్రమే యాక్టివ్‌గా ఉంచినా, బీజేపీ రాజకీయ శైలిలో ఆయనను ద్వితీయ శ్రేణి నాయకుడిగా మార్చే అవకాశం ఉంది. అందుకే కుటుంబానికి ప్రాతినిధ్యం వహించే మరో పార్టీ ప్రజల్లో నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో కవితను ముందుకు నెడుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి, కవిత ఎపిసోడ్ వెనుక కేసీఆర్ ఉన్నారన్న అభిప్రాయం బలపడుతోంది. ఈ ఎపిసోడ్ త‌ర్వాత ఇది కుటుంబంలో చీలిక కాదని, ఇది మొత్తం ఒక వ్యూహాత్మక నాటకం అన్న సందేహాల‌ను కూడా కొంద‌రు విశ్లేష‌కులు వ్య‌క్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: