క‌విత సొంత పార్టీ... బీఆర్ఎస్‌కు ఎఫెక్ట్ ఎంత‌...?

RAMAKRISHNA S.S.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న ప్రశ్న – “కవిత వాట్ నెక్ట్స్?” . బీఆర్ఎస్ పార్టీతో ఆమె సంబంధం తెగిపోవ‌డం, పార్టీకి వ్యతిరేకంగా ఆమె స్వరాన్ని వినిపించడం ఈ ప్రశ్నకు మరింత బలం చేకూర్చాయి. కవిత సొంత పార్టీ పెట్టుకునే ఆలోచన చాలా రోజులుగా నడుస్తోంది. క్యాడర్‌ను సిద్ధం చేసుకోవడం, స్థానిక స్థాయిలో తన బలాన్ని పెంచుకోవడం, మహిళల్లో ఫాలోయింగ్‌ని కాపాడుకోవడం వంటి కసరత్తులు ఆమె ఇప్పటికే చేస్తున్నారు. ముఖ్యంగా స్థానిక ఎన్నికల తర్వాత తన స్వంత పార్టీని ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కవిత రాజకీయ ప్రస్థానం తెలంగాణ ఉద్యమంతో ముడిపడి ఉంది. కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని పుంజుకొని ముందుకు తీసుకెళ్తున్న సమయంలోనే ఆమె “జాగృతి” అనే సాంస్కృతిక వేదికతో ప్రజల్లోకి ప్రవేశించారు. బతుకమ్మ పండుగను జాతీయ స్థాయిలో పరిచయం చేయడం, సాంస్కృతికంగా తెలంగాణ ప్రజలను ఏకం చేయడం ద్వారా ఆమెకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఈ గుర్తింపే తరువాత ఆమెను రాజకీయాల్లో బలంగా నిలబెట్టింది. నిజామాబాద్ ప్రాంతంలో బీఆర్ఎస్ తరపున ఆమె ప్రభావం అంతలా ఉండేది, ఇతర నాయకులు ఆమె పరిధిలోకి రావడానికి వెనుకాడేవారు.


కవితలో ఉన్న నాయకత్వ లక్షణాలు, ప్రజలతో కలిసిపోయే తీరు కేటీఆర్‌తో పోలిస్తే కూడా మెరుగైనవని బీఆర్ఎస్ లోపలే కొందరు అభిప్రాయపడ్డారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. బీఆర్ఎస్ భవిష్యత్తు అనిశ్చితంగా ఉన్న ఈ దశలో, కవిత తన సొంత పార్టీని పెట్టుకుంటే గెలుపు సాధిస్తారని అనుకోవడం కష్టం. కానీ ఆమె లక్ష్యం మొత్తం రాష్ట్రాన్ని గెలుచుకోవడం కాకుండా, ప్రభావం చూపడమే. తెలంగాణలో ఏ ఎన్నికైనా 2-3 శాతం ఓటు బ్యాంకు కూడా ఫలితాలను మార్చగలదు. అలాంటి స్థాయిని కవిత సాధిస్తే, ఆమె నిజమైన గేమ్ ఛేంజర్‌గా నిలవొచ్చు. భారత రాష్ట్ర సమితి చివరికి బీజేపీలో విలీనం అయితే, తెలంగాణ ప్రాంతీయ పార్టీగా కవిత పార్టీ ప్రధానంగా నిలబడే అవకాశం ఉంటుంది. విలీనం కాకపోయినా, బీఆర్ఎస్ ఓటు బ్యాంకు లో కొంతభాగాన్ని తన వైపు తిప్పుకోవచ్చు.


ఈ కారణంగానే బీఆర్ఎస్ ఇటీవల కవితపై దాడి మరింత పెంచింది. జాగృతి తనదేనని మాజీ నాయకులను రంగంలోకి దింపడం, ఆమెను బలహీనపర్చే ప్రయత్నాలు ఇవన్నీ కవితకు పరోక్షంగా మేలు చేసే అవకాశముంది.
మొత్తానికి, కవిత సొంత పార్టీతో తిరుగులేని విజయాలు సాధించడం కష్టం.. కానీ ఆమె బీఆర్ఎస్ త‌ల‌రాత‌ను మార్చ‌వ‌చ్చు అన‌డంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: