ఏపీలో ప్రజల మైండ్ సెట్ మారుతోందా.. వార్నింగ్ ఎవరికి...?
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలనుగమనిస్తే.. ఎవరు గెలిచారు.. ఎవరు ఓడారు.. అనే విషయం కన్నా.. ప్రజల్లో మాత్రం చైతన్యం కనిపించింది. గత ఎన్నికలకు భిన్నంగా ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం మరింత తగ్గింది. అంటే..ప్రజలలో ఏ పార్టీపైనా విశ్వాసం కనిపించడం లేదు. ఈ విషయం పెద్దగా ప్రచారానికి రాకపోయినా.. జాతీయస్థాయిలో మాత్రం చర్చ అయితే..సాగుతోంది. ఇదే పరిస్థితి ఇక్కడ కూడా ప్రతిబింబించే అవకాశం ఎంతో ఉంటుందని మేధావులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా తీవ్రంగా ప్రభావం చూపుతోందనేది వాస్తవం.
ఈ క్రమంలో ప్రభుత్వాలు.. పార్టీలు తమకు ఏం మేలు చేస్తున్నాయనే విషయాన్ని ప్రజలు విస్తృతంగా చర్చిస్తున్నారు. తమకు మేలు చేస్తున్న ప్రభుత్వం కానీ, పార్టీలు కానీ, లేవనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. బహుశ ఈ విషయం పసిగట్టే.. అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రజల మధ్య ఉండాలని.. నిర్ణయించుకున్నాయి. నిజమే.. ప్రజల మధ్య ఉంటారు.కానీ, ప్రజల ఆశలు తీర్చనప్పుడు.. వారి సమస్యలు పరిష్కారం చేయనప్పుడు.. ఎందుకు? అనే ప్రశ్న సర్వత్రా వినిపిస్తోంది.
సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలు ప్రజలను వెంటాడుతున్నాయి. వర్షపు నీటిని ఒడిసి పట్టేయంత్రంగా మనదగ్గర ఇప్పటికీ లేదు. సాగునీటికి ప్రాధాన్యం లేదు. రైతులకు విలు వ లేదు.. వారు పండించిన ధాన్యానికి మద్దతులేదు. మార్కెట్‌లో ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఆయా సమస్యలను పట్టించుకునే నాధుడు కూడా కనిపించడం లేదు. ఈ సమయంలో ప్రజలు ఏ పార్టీని ఆదరించే పరిస్థితి లేకుండా పోతుందనే అంచనాలు వస్తున్నాయి. ఓటింగ్ జరుగుతుంది .. కానీ.. ప్రజలు అంతగా స్పందించే పరిస్థితి లేదని అంటున్నారు. మరి ఆయా విషయాలపై పార్టీలు.. ప్రభుత్వాలు ఇప్పటికైనా దృష్టి పెడతాయా? అనేది చూడాలి.