జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ అవుట్.. బీజేపీకి ఆప్షన్ ఆ పార్టీ ఒక్కటే...!
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు నేడు విడుదలవుతున్నాయి. ఈ ఫలితాల్లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ తన ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది. ఉత్తర ప్రదేశ్, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఆ పార్టీ హవా స్పష్టంగా కనిపిస్తోంది. గోవాలో హంగ్ దిశగా ఫలితాలు సాగుతున్నాయి. మరో ప్రధాన రాష్ట్రమైన పంజాబ్ లో మాత్రం కాంగ్రెస్ తన అధికారాన్ని నిలబెట్టుకోలేక పోయింది. ఆమ్ ఆద్మీ పార్టీకి తన అధికారం అప్పగించబోతోంది.
కాంగ్రెస్ దుస్థితికి ఆ పార్టీ స్వయంకృతాపరాధమే కారణమని స్పష్టంగా తెలుస్తోంది. పంజాబ్ లో తిరిగి అధికారాన్ని దక్కించుకోలేకపోవడం.. మిగతా రాష్ట్రాల్లో నామమాత్రంగా మిగలడం ఆ పార్టీకి మింగుడుపడని పరిణామమే. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ను మోదీ కోలుకోలేని విధంగా దెబ్బతీశారు. దానికి తోడు ఆయా రాష్ట్రాల్లో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఉన్న కాంగ్రెస్ ను మెల్లమెల్లగా దూరం చేసి ఇతర పార్టీలను ప్రోత్సహించారు మోదీ. దీంతో తన చేతికి మట్టి అంటకుండానే కాంగ్రెస్ ను వదిలించుకుంటున్నారు మోదీ.
మధ్యప్రదేశ్, కర్ణాటక, ఢిల్లీ, పంజాబ్ తదితర రాష్ట్రాలు గతంలో కాంగ్రెస్ చేతిలో ఉన్నవే. కానీ ఆయా రాష్ట్రాల్లో క్రమంగా కనుమరుగయ్యాయి. తాజాగా పంజాబ్ ఫలితాలే అందుకు నిదర్శనం. సీఎంగా ఉన్న అమరీందర్ ను తప్పించడం.. పీసీసీ చీఫ్ సిధ్దూకు, అమరీందర్ కు ఉన్న గొడవను పరిష్కరించలేకపోవడం.. చివర్లో దళితుడు చన్నీని సీఎం గా చేయడం.. తాజాగా ఆయననే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం.. తదితర కారణాలతో ప్రజల్లో విశ్వాసం కోల్పోయి ఆప్‌కు అవకాశం వదులుకుంది.
ఇపుడు ఆప్ అధినేత కేజ్రీవాల్ లక్ష్యం కూడా అదే. బీజేపీకి ప్రత్యామ్నాయం తమ పార్టీయేనని నిరూపించుకోవడం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. తొలుత ఢిల్లీలో పాగా వేసిన ఆప్ తాజాగా పంజాబ్ కు పాకింది. మెల్లమెల్లగా ఇతర రాష్ట్రాల్లో కూడా చొరబడాలని చూస్తోంది. త్వరలో దక్షిణాదిలో జరిగే కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలపై కన్నేశారు కేజ్రీవాల్. ప్రతిపక్ష స్థానం నుంచి రాహుల్ ను పక్కకు జరిపి ఆ స్థానంలో తను కూర్చోవాలని కేజ్రీవాల్ పట్టుదలగా ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..!