బీజేపీని త‌మిళ‌నాట అడుగుపెట్ట‌నివ్వ‌రా..?

           త‌మిళ‌నాడులో ముఖ్య‌మంత్రి పీఠం అధిష్ఠించిన‌ నాటినుంచి స్టాలిన్ ఆ రాష్ట్రంలో గ‌తంలో పార్టీలు అనుస‌రించిన వైఖ‌రికి పూర్తి భిన్న‌మైన పంథాలో  ముందుకు వెళుతున్నారు. తొలిసారిగా సీఎం అయినా గొప్ప ప‌రిణితిని ప్ర‌ద‌ర్శిస్తూ డీఎంకే సానుభూతి ప‌రుల‌నుంచి మాత్ర‌మే కాకుండా అన్నాడీఎంకే అభిమానుల నుంచి కూడా మ‌న్న‌న‌లందుకుంటున్నారు. గ‌తంలో ఆ రాష్ట్రంలో డీఎంకే, అన్నాడీఎంకేల మ‌ధ్య అధికారం చేతులు మారిన‌ప్పుడ‌ల్లా ప్ర‌తీకార రాజ‌కీయాలు సాగేవి. ప్ర‌తిప‌క్ష నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌పై దాడులు, వేధింపులు నిత్య‌కృత్యంగా ఉండేవి. రాజ‌కీయంగా సుదీర్ఘ అనుభ‌వ‌మున్న క‌రుణానిధి, అన్నాడీఎంకే అధినేత్రి జ‌య‌ల‌లితల మ‌ధ్య రాజ‌కీయ శ‌త్రుత్వం వ్య‌క్తిగ‌త స్థాయికి చేర‌డంతో అప్ప‌ట్లో ఈ త‌ర‌హా రాజ‌కీయాల‌కు త‌మిళ‌నాడు కేర్ ఆఫ్ అడ్ర‌స్‌గా మారిపోయింది. ద‌శాబ్దాల‌పాటు సాగిన ఈ ప‌రిస్థితిని స్టాలిన్ స‌మూలంగా మార్చేశారు. అన్నాడీఎంకే అధినేత్రి జ‌య‌ల‌లిత ముఖ్య‌మంత్రిగా ఉండ‌గానే అనారోగ్యం పాలై చ‌నిపోయిన విష‌యం తెలిసిందే. ఆమె సీఎంగా ఉన్న‌ప్పుడు ప్రారంభించిన సంక్షేమ కార్య‌క్రమాల‌ను ప్ర‌స్తుత సీఎం స్టాలిన్ కొనసాగిస్తున్నారు. అంతేకాదు ఆ ప‌థ‌కాల‌ను ఆమె పేరునే కంటిన్యూ చేయ‌డం ద్వారా జ‌య‌ల‌లిత‌ను గౌర‌వించి ప్ర‌త్య‌ర్థి పార్టీ సానుభూతిప‌రుల మ‌నసుల‌ను కూడా సీఎం స్టాలిన్ గెలుచుకున్నారు.
   

         అయితే స్టాలిన్ అనుస‌రిస్తున్న వైఖ‌రి వెనుక రాజ‌కీయ వ్యూహం కూడా ఉన్న‌ద‌ని, జాతీయ పార్టీల‌ను ముఖ్యంగా బీజేపీని ప్ర‌త్య‌క్షంగా కానీ ప‌రోక్షంగా కానీ త‌మిళ‌నాట అడుగుపెట్ట‌నివ్వ‌కుండా చేయ‌డ‌మే ఆయ‌న ల‌క్ష్య‌మ‌ని రాజ‌కీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్ర‌స్తుతం జ‌య‌ల‌లిత జీవించి లేరు కాబ‌ట్టి ఆవిడ నుంచి రాజ‌కీయంగా ఎదుర‌య్యే ముప్పు లేద‌ని, ఇందుకే ఆమెను గౌర‌వించ‌డం ద్వారా ఏఐఏడీఎంకే బ‌లాన్ని కూడా త‌గ్గించే ప్ర‌య‌త్నాల్లో స్టాలిన్ ఉన్నార‌న్న‌ది వారి అభిప్రాయం. అంతేకాకుండా జ‌య‌ల‌లిత మ‌ర‌ణం త‌ర్వాత తమిళ‌నాడు రాజ‌కీయాల‌ను త‌న చేతిలోకి తెచ్చుకునేందుకు బీజేపీ అనుస‌రించిన వ్యూహాల‌ను చూశాక‌, ఆ పార్టీని ఆదిలోనే నిలువ‌రించేందుకు త‌న‌దైన శైలిలో స్టాలిన్ పావులు క‌దుపుతున్నార‌ని చెపుతున్నారు. నిజానికి త‌మిళ‌నాట ద్ర‌విడ పార్టీల‌దే ఎప్పుడూ ఆధిప‌త్యం. జాతీయ పార్టీల పాత్ర అక్క‌డ నామ‌మాత్ర‌మే. అయితే మోదీషాల నేతృత్వంలోని బీజేపీ ఆ ప‌రిస్థితి మార్చాల‌ని తీవ్ర‌స్థాయిలో చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ను స్టాలిన్ నిశితంగా గ‌మ‌నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: