అమిత్ షా ఎందుకు వస్తున్నారు.?

అమిత్ షా   ఎందుకు వస్తున్నారు.?


అమిత్ షా... కేంద్ర హోం శాఖ మంత్రి నవంబర్ 14న ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుపతికి వస్తున్నారు. ఈ విషయాన్ని కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనిరుథ్ ప్రసాద్ ప్రకటించారు. అంత వరకూ బాగానే ఉంది. అసలు అమిత్ షా ఆంధ్ర ప్రదేశ్ కు ఎందుకు వస్తున్నారు ? పైగా తిరుపతి కి ఎందుకు వస్తున్నారు ? తిరుమలలో కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించు కోవడానికా ? కాదు. మరేందుకు వస్తున్నారు ? ఆంధ్ర ప్రదేశ్ లో నెలకొన్న పరిస్థితులను స్వయంగా బేరీజు వేయడానికి తిరుపతి వస్తున్నారా ? కాదు, ఇంకెందుకు వస్తున్నట్లు ? ఈ ప్రశ్నలు రాజకీయ పక్షాలలో వెల్లువెెత్తుతున్నాయి.
ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయ పరిస్థితులు బాగా లేవని మాజీ ముఖ్యమంత్రి , తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర బాబు నాయుడు ఇటీవల ఫోన్ లో ఫిర్యాదు చేశారు. ఆ పై ఢిల్లీ వెళ్లారు.  కేంద్ర హోం మంత్రి అపాయింట్ మెంట్ కోసం రెెండు రోజులు పడిగాపులు కాశారు. అయినా  అపాయింట్ మెంట్ లభించ లేదు.  ఎదురు చూసి... ఎదురు చూసి  చివరకి విసిగి వేసారి పోయి స్వంత గూటికి చేరుకున్నారు. అమిత్ షా  స్వయంగా ఫోన్ చేశారని, తమ అధినేతతో మాట్లాడారని తెలుగు దేశం పార్టీ శ్రేణులు మీడియాకు సమాచారం ఇచ్చాయి. అయితే ఈ విషయం పై కేంద్ర హోం మంత్రి శాఖకు చెందిన ఏ అధికారి కూడా వివరణ ఇవ్వలేదు.
తిరుపతి నగరంలో ఈ నెల 14న సదరన్ జోనల్ కౌన్సిల్  మీట్ జరగ నుంది.  ఈ  సమావేశానికి దక్షిణ భారత దేశంలో ని గవర్నర్ లు,  ముఖ్యమంత్రులతో పాటు, లక్షద్వీప్, అండమాన్, నికోబార్  లెఫ్టనెంట్ గవర్నర్ లు హాజరవుతారు. ఈ సమావేశానికి చాలా ప్రాధాన్యత ఉంది.  దక్షిణాది రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలను ఇక్కడ చర్చిస్తారు.  రాష్ట్రాల మధ్య సమన్వయానికి కృషి చేస్తారు.  
 
ఇప్పటి వరకూ ఉన్న సమాచారం ప్రకారం తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొని ఉన్న సమస్యలు ప్రధాన అజెండా.  రాష్ట్ర విభజన సమయం లో  ఇరు రాష్ట్రాలకు ఇచ్చిన హామీలు, వాటి పురోగతిని చర్చిస్తారు. తెలుగు రాష్ట్రాలమధ్య ఇటీవలి కాలం ముదిరి పాకాన పడిన నీటి పంపకాల విషయం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. దీనికి తోడు కర్ణాటక ప్రభుత్వం  గత కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల పై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. తెలంగాణ ప్రభుత్వం పాలమూరు - రంగా రెడ్డి ఎత్తి పోతల పథకం,  నక్కలగండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం  ద్వారా   నీటిని  పరిమితులకు మించి వాడుకుంటున్నారని కర్ణాటక ప్రభుత్వం  వీలు చిక్కినప్పుడల్లా ఫిర్యాదు చేస్తోంది. ఈ అంశానకి తోడు శ్రీశైలం జలాశయం లో అదనపు నీటి వినియోగం పై కూడా సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.  ఇప్పటి వరకూ ఇదే సమావేశం అజెండా. దీనిని కేంద్ర ప్రభుత్వ అధికారులు పూర్తి స్థాయిలో ఖరారు చేయాల్సి ఉంది.


ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల నెలకన్న రాజకీయ పరిణామాలు చర్చకు వచ్చే అవకాశం లేదని పేరు చెప్పడానికి  ఇష్టపడని హోం శాఖ అధికారులు తెలిపారు. సదరన్ జోనల్ కౌన్సిల్  మీట్ లో రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలు మాత్రమే చర్చిస్తారని చెప్పారు. రాష్ట్రం లో అంతర్గత సమస్యలు చర్చకు వచ్చే అవకాశం ఏ మాత్రం లేదని హోం శాఖ అధికారులు   స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: