పారిన కేసీఆర్ పాచిక..!

హస్తినలో కేసీఆర్ మంత్రాంగం ఫలించిందా... ? ఆయన చేయాల్సిన పని పూర్తయ్యిందా..? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. బయట ప్రపంచానికి మాత్రం తెలిసింది ఒకటి... కానీ అక్కడ జరిగింది మరోటి... పార్టీ కార్యాలయానికి భూమి పూజ పేరుతో ఢిల్లీ వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... పనిలో పనిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన విషయాలపై చర్చించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కానీ రాష్ట్రానికి కావాల్సిన పనుల జాబితా పక్కన పెడితే... కేంద్రం చేసిన ప్రకటన... ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
తెలంగాణలో అందరినీ ఆకర్షిస్తున్న అంశం ఒకటే. అదే హుజురాబాద్ శాసనసభకు ఉప ఎన్నిక. మాజీ మంత్రి, టీఆర్ఎస్‌లో నెంబర్ టూగా ఉన్న ఈటల రాజేందర్ అనూహ్యంగా ఆ పార్టీకి రాజీనామా చేయడంతో హుజురాబాద్‌లో ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈటల... బీజేపీలో చేరి... ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టారు. అటు టీఆర్ఎస్ పార్టీ కూడా ఈ ఎన్నికలో విజయం కోసం ఇప్పటి నుంచే భారీ కసరత్తు చేస్తోంది. ఉప ఎన్నిక కోసం ఏకంగా దళిత బంధు పేరుతో భారీ పథకాన్నే ప్రకటించింది. ఇప్పటికే ఆ నియోజకవర్గ బాధ్యతను మేనల్లుడు, ట్రబుల్ షూటర్ హరీష్ రావుకు అప్పగించారు కేసీఆర్. అయినా సరే... ఆయన తన మార్క్ రాజకీయం చేశారు పెద్ద సారు.
హస్తిన పర్యటనలో ప్రధానితో భేటీలో ఏ విషయంపై చర్చ జరిగిందో తెలియదు కానీ... తెల్లారే ఆయన అనుకున్నది జరిగింది. దేశంలో ఖాళీగా ఉన్న నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు ఈ మధ్య కాలంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించింది. ఈ జాబితాలో హుజురాబాద్ కూడా ఉంది. ఈ ఉప ఎన్నికపై కూడా తెలంగాణ అధికారులతో ఈసీ చర్చ జరిపింది. ఇక ప్రకటన మాత్రమే మిగిలి ఉందని అంతా భావించారు. కానీ ఈ రోజు విడుదలైన జాబితాలో హుజురాబాద్ పేరు లేదు. పశ్చిమ బెంగాల్‌లో మూడు, ఒడిశాలో ఒక నియోజకవర్గానికి మాత్రమే ఉప ఎన్నిక జరుపుతున్నట్లు ఈసీ ప్రకటించింది. మిగిలిన వాటికి దసరా తర్వాత జరుపుతామంది.
దసరా తర్వాత అంటే ప్రభుత్వానికి మరో నెల రోజులు గడువు దొరికినట్లే. ఈ లోపు దళిత బంధు పథకంపై విస్తృత ప్రచారం నిర్వహించవచ్చు. అలాగే దసరా పండుగకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బతుకమ్మ చీరలను సరఫరా చేయవచ్చు. ఈ లోపు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న ఈటలపై కావాల్సినంత నెగిటివ్ ప్రచారం నిర్వహించి... ఆయన ప్రాభవాన్ని తగ్గించేందుకు కూడా టీఆర్ఎస్ నేతలకు అవకాశం ఉంది. ఇప్పటి వరకు హుజురాబాద్‌ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టిన కమలం పార్టీ నేతలు... ప్రస్తుతం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రలో పాల్గొంటున్నారు. బండి సంజయ్ యాత్ర విజయవంతమైతే చాలన్నట్లుగా కాషాయా పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారు. దీనితో హుజురాబాద్ పై కాస్త శీతకన్ను వేశారనే చెప్పాలి. దీనితో కేసీఆర్ అనుకున్నది చేసేందుకు ఈ వాయిదా బాగా పనికొస్తుంది. హస్తిన పర్యటనలో కేసీఆర్ మంత్రాంగం ఫలించినట్లుగానే రాజకీయ విమర్శకులు వెల్లడిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: