అయ్యా బాబు.. పిలుపు ఇచ్చారు... కానీ కనిపించలేదు..!

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై ప్రస్తుతం సొంత పార్టీ నేతలే గుర్రుగా ఉన్నారు. అందుకు ప్రధాన కారణం... ఆయన చేసిన పనే. అది ఎప్పుడో జరిగింది కాదు... ఈ రోజు జరిగిందే. పార్టీ నేతలకు ఎన్నో నీతి పాఠాలు చెప్పే అధినేత... తానే స్వయంగా ఆచరించకపోవడం ఏమిటని అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై మొదటి నుంచి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న టీడీపీ అధినేత... ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేయాలని పార్టీ నేతలకు సూచించారు. అదే సమయంలో... పెట్రోల్, డీజీల్, గ్యాస్ ధరల పెంపు, నిత్యావసరాల ధరలు కూడా భారీగా పెరగడంపై ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టాలని సొంత పార్టీ నేతలకు తెలుగుదేశం పార్టీ అధినేత పిలుపునిచ్చారు. పార్టీలోని కిందిస్థాయి కార్యకర్త వరకూ కూడా ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొనాలని సూచించారు. ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద... మండల రెవెన్యూ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టాలన్నారు. ప్రభుత్వ విధానాలను ప్రజలకు వివరించాలని సూచించారు.
ఇంత వరకు బాగానే ఉన్నా... అసలు కథ ఇక్కడే జరిగింది. నిరసన ప్రదర్శనలు చేయాలని పార్టీ నేతలకు సూచించిన అధినేత మాత్రం... హైదరాబాద్ ఇంద్ర భవనం వదిలి రాకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కొవిడ్ సాకుతో దాదాపు ఏడాదిన్నరగా హైదరాబాద్ కే పరిమితమైన చంద్రబాబు... ఏదో అప్పుడప్పుడు అలా చుట్టపు చూపుగా వచ్చి... ఇలా వెళ్లిపోతున్నారు. ఇక ప్రెస్ మీట్ లు, పార్టీ నేతలతో సమీక్షలు కూడా జూమ్ యాప్ ద్వారా నిర్వహించారు. దీనిపై అధికార పార్టీ నేతలు వ్యంగ్యాస్త్రాలు వేశారు. ఏకంగా చంద్రబాబు పేరును కూడా జూమ్ బాబు అంటూ మార్చేశారు. హైదరాబాద్ లో ఉంటూ ఆంధ్రా రాజకీయాల గురించి మీకెందుకు బాబూ అంటూ కూడా ఎద్దేవా చేశారు వైసీపీ నేతలు.
అటు అధికార పార్టీ నేతల విమర్శలు ఎక్కువవ్వడం... సొంత పార్టీ నేతల్లో అసహనం వల్ల... వ్యతిరేకత పెరుగుతుండటంతో... చివరికి చినబాబు నారా లోకేష్ స్వయంగా రంగంలోకి దిగారు. రాష్ట్రంలో విస్తృత పర్యటనలు చేస్తూ... పరామర్శలు చేస్తూ.. పార్టీ నేతల్లో, కార్యకర్తల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. అయితే... ఈ రోజు విషయంలో మాత్రం ఇద్దరు నేతలపై పార్టీ నాయకులు గుర్రుగానే ఉన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తన సొంత జిల్లా శ్రీకాకుళం జిల్లాలో జరిగిన నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. మరి రాష్ట్ర రాజధాని ప్రాంతం అమరావతి, విజయవాడలో జరిగిన నిరసన ప్రదర్శనలో ఎక్కడా అధినేత పాల్గొనలేదు. రాష్ట్ర రాజధానిలో జరిగిన నిరసన కార్యక్రమంలో కేవలం నియోజకవర్గ స్థాయి నేతలు మాత్రమే పాల్గొన్నారు తప్ప... రాష్ట్ర స్థాయి నేతలు ఒక్కరు కూడ పాల్గొనలేదు. ఇదే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చేపట్టిన నిరసన ప్రదర్శనకు అధినేత రాకపోవడంపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: