మొదటి, రెండో ప్రపంచ యుద్ధాలతో సంభవించిన నష్టాల అనుభవంతో 1945లో ప్రపంచంలో శాంతి స్థాపనే లక్ష్యంగా ప్రపంచ దేశాలు ఒక
అంతర్జాతీయ సంస్థకు పునాది వేశాయి. యాభై దేశాల ప్రతినిధులు సమావేశమై ఒప్పందంపై సంతకాలు చేశారు. మరో ప్రపంచ యుద్ధం మొదలు కాకుండా చర్యలు తీసుకొనేందుకు ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేశారు. ఇప్పుడు అఫ్గానిస్తాన్ ను తాలిబన్లు ఆక్రమించడంతో అక్కడ మానవ సంక్షోభం ఏర్పడింది. ఈనేపథ్యంలో ఐక్యరాజ్య సమితి ఏంచేస్తోందనే ప్రశ్నలు వస్తున్నాయి. మేథావులు, దౌత్యవేత్తలు, విద్యావేత్తలు, జర్నలిస్టులు మొదలు సామాన్యుల వరకు ‛‛ఐక్యరాజ్య సమితి ఎక్కడ ఉంది?’’ అని ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న ఈ ప్రశ్నలతో ఐక్యరాజ్య సమితి ట్రెండ్ అవుతోంది. యుద్ధానికి దారితీసేలా ప్రేరేపిస్తున్న తాలిబన్లను కట్టడి చేసి, అఫ్గానిస్తాన్ లో సంక్షోభాన్ని లేకుండా చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని కోరారు. అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా చూడాలన్నారు. సైనిక చర్యలతో అధికారాన్ని చేజిక్కించుకోవడం వినాశనమే అన్నారు. దీంతో పాటు ఆయన అఫ్గానిస్తాన్ శరణార్థులను కాపాడుకోవాలని ఇతర దేశాలను అభ్యర్థించారు. అయితే ఐక్యరాజ్య సమితి తాలిబన్లను అభ్యర్థించడమెందుకని, ఏకంగా చర్యలు తీసుకుంటే సరికదా అని చాలా మంది మేథావులు అంటున్నారు. సంస్థాగతమైన లోపాలతోనే ఐక్యరాజ్య సమితి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం లేదని తెలుస్తోంది. ఐక్యరాజ్య సమితి ఆరు ప్రధాన విభాగాల్లో ఒకటైన భద్రతామండలి
అంతర్జాతీయ భద్రత, శాంతి పరిరక్షణ కోసం పాటు పడుతుంది. యునైటెడ్ నేషన్స్ చార్టర్ ప్రకారం భద్రతా మండలిలో ఐదు దేశాలు మాత్రమే శాశ్వత సభ్యత్వం కలిగి ఉన్నాయి.
అమెరికా,
రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాలకే వీటో పవర్ ఉంది. దీని ప్రకారం భద్రతా మండలి ఏదైనా తీర్మానం గానీ, నిర్ణయం గానీ తీసుకోవాలంటే ఈ ఐదు దేశాలు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. వీటో అధికారం ప్రకారం ఏఒక్క దేశం అడ్డుపడినా తీర్మానం ఆమోదం పొందదు. ఈ ఐదు సభ్య దేశాలు ఒకే మాటమీద ఉండడం అరుదుగా కనిపిస్తుంది. అందుకోసమే భద్రతా మండలి ఏదైనా దేశ సమస్యను పరిష్కరించడంలో విఫలమవుతోంది. ఇదొక సమస్య అనుకుంటే మరొక నిబంధన కూడా ఐక్యరాజ్య సమితిని అచేతనంగా మార్చుతోంది. యుద్ధాన్ని ఆపి, శాంతిని స్థాపించాలని రెండు వర్గాల నుంచి అభ్యర్థనలు వచ్చినప్పుడే ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ దళాలను ఆ దేశానికి పంపుతుంది. అఫ్గాన్ లో అగ్ర దేశాల జోక్యం ఉంటోంది. ఇది ఐక్యరాజ్య సమితి పాత్రను తగ్గిస్తోంది. ఇరవై ఏండ్లుగా
అమెరికా తాలిబాన్లపై దాడులు చేస్తోంది. మరోవైపు
రష్యా, చైనా తాలిబాన్లను గుర్తించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇంకోవైపు చైనా, రష్యాతో
అమెరికా సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. తాలిబాన్లకు వ్యతిరేకంగా ఏదైనా సభ్య దేశం తీర్మానం చేస్తే వీటో అధికారాలతో చైనా,
రష్యా అడ్డుపడనున్నాయి. ఐక్యరాజ్య సమితిలో సంస్థాగతమైన సంస్కరణలు తీసుకువస్తేనే దానికి బలం వస్తుంది. ఐక్యరాజ్య సమితి ఏర్పడి 76 ఏండ్లు దాటిపోయినా ఐదే సభ్య దేశాలు ఉన్నాయి. అప్పటి నుంచి ఎన్నో మార్పులు సంభవించినా, ఐరాసలో మార్పులు ప్రతిబింబించడంలేదు. కొత్త మార్పులు తీసుకురాకపోతే ఆ ఐదు శాశ్వత సభ్య దేశాలకు లబ్ధి జరిగే ఎజెండానే అమలవుతుంది. సంస్థాగత లోపాలతో భారత్, జపాన్, జర్మనీకి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం దక్కడంలేదు. వీటో అధికారాలతోనే యుద్ధ సమయాల్లో మిత్రపక్షాలపై చర్యలు తీసుకోకుండా శాశ్వత సభ్య దేశాలు అడ్డుకుంటున్నాయి. అఫ్గానిస్తాన్ లో తలెత్తిన సంక్షోభంలోనూ ఇదే జరుగుతోంది. మొదటి ప్రపంచ యుద్ధం అనంతరం 1920లో
పారిస్ శాంతి ఒప్పందంతో ఏర్పడిన నానాజాతి సమితి కూడా సంస్థాగత లోపాలతో విఫలమైంది. అది రెండో ప్రపంచ యుద్ధాన్ని ఆపలేకపోయింది. ప్రపంచంలో శాంతిని కాపాడడం, యుద్ధాలను అడ్డుకోవడం తదితర లక్ష్యాలతో ఏర్పడిన మొట్టమొదటి
అంతర్జాతీయ సంస్థ అయిన నానాజాతి సమితి విఫలమైనట్టే.. ఐక్యరాజ్య సమితి కూడా అగ్రరాజ్యాల చేతిలో కీలుబొమ్మగా మారింది. ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి అఫ్గానిస్తాన్ లోవైద్యపరమైన సహాయంతో పాటు శరణార్థులకు పునరావాసం, బాలికల విద్యకు ప్రోత్సాహాన్ని మాత్రం అందిస్తోంది. పెద్దన్న పాత్రకు మాత్రం ముందుకు రావడంలేదు.