కేసీఆర్ కి ఈటలపై అంత పగ ఉందా..?

Deekshitha Reddy
కేసీఆర్ పగతో రగిలిపోతున్నారు. ఈటలని ఎలాగైనా ఓడించాలని కంకణం కట్టుకున్నారు. హుజూరాబాద్ కేంద్రంగా జరుగుతున్న రాజకీయాలే ఇందుకు నిదర్శనం. హుజూరాబాద్ ఉప ఎన్నికల నగారా ఇంకా మోగకముందే కేసీఆర్ ఇంత చేస్తున్నారంటే, ఇక ఎన్నికల పర్వం మొదలైతే ఈ హడావిడి ఎంతలా ఉంటుందో ఊహించలేం.

హుజూరాబాద్ కేంద్రంగా మంత్రుల్ని మోహరించారు.
బీజేపీ నుంచి మాజీ మంత్రి పెద్దిరెడ్డిని తనవైపు లాగేసుకున్నారు.
కాంగ్రెస్ నుంచి కౌశిక్ రెడ్డిని పార్టీలో చేర్చుకుని ఎవ్వరూ ఊహించని విధంగా ఎమ్మెల్సీ ఇచ్చారు.
ఎన్నికల ముందుగా దళితబంధుని ప్రకటించడమే కాదు.. హుజూరాబాద్ నుంచే దాన్ని మొదలు పెడుతున్నారు.

ఒకటా, రెండా కేసీఆర్ ప్రస్తుతం చేస్తున్న, చేయబోతున్న ప్రకటనలు అన్నీ హుజూరాబాద్ ఎన్నికలను మనసులో పెట్టుకుని చేస్తున్నవే అనిపిస్తున్నాయి. ఈటలపై ఆయనకు ఉన్న పగను బయటపెడుతున్నాయి.

ఈటల రాజేందర్ కూడా ఉద్యమ నాయకుడే. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్రను తక్కువ చేసి చూపించలేం. తెలంగాణలో జరిగే ఎన్నికలన్నిట్లో ప్రత్యేక రాష్ట్రంకోసం పోరాటం చేసినవారినే గెలిపించాలనే నియమం ఉంటే.. హుజూరాబాద్ లో ఈటలే గెలిచి తీరాలి. మిగతా వారంతా వారి వారి పార్టీల నిర్ణయం మేరకు తెలంగాణ ఏర్పాటుకు అడ్డుపడ్డవారే. ప్రస్తుతం కేసీఆర్ కేబినెట్ లో ఉన్న మంత్రుల్లో చాలామంది గతంలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుని తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ రాజకీయ అవసరాలకోసం, సామాజిక సమీకరణాలకోసం కేసీఆర్ వారందర్నీ చేరదీసి పదవులిచ్చారు. ఉద్యమ సమయంలో కలసి పనిచేసిన ఈటలను అవినీతి ఆరోపణలతో పక్కనపెట్టారు.

మంత్రి పదవి కోల్పోయిన ఈటల కూడా ఎక్కడా తగ్గేది లేదంటూ కేసీఆర్ కి తన పవరేంటో చూపిస్తానంటున్నారు. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే కేసీఆర్ ని ఢీకొనడం కష్టసాధ్యమని గ్రహించిన ఆయన, బీజేపీలో చేరి కేసీఆర్ కి సవాల్ విసిరారు. హుజూరాబాద్ గెలుపు వీరిద్దరికీ ప్రతిష్టాత్మకంగా మారింది. అందుకే కేసీఆర్ రాష్ట్ర పాలన సైతం పక్కనపెట్టి ఇక్కడే ఫోకస్ పెట్టారు. ఎలాగైనా ఈటలను ఓడించాలని అనుకుంటున్నారు. కేసీఆర్ వ్యూహాలు చూస్తుంటే.. ఆయనకు ఈటలపై ఇంత పగ ఉందా అనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: