మోదీ గేమ్ ప్లాన్ అదుర్స్
దేశంలో కరోనా సెకండ్ వేవ్ సృష్టించిన నష్టం అంతా ఇంతా కాదు. ఆక్సిజన్ కొరతతో కొవిడ్ రోగులు పడిన పాట్లు అన్నీ ఇన్నీ కాదు. ఇక మందుల బ్లాక్ మార్కెట్ వ్యవహారం అయితే సరే సరి. భారత్ కు సాయం అందించేందుకు చివరికి పొరుగుతున్న బంగ్లాదేశ్ కూడా ముందుకు వచ్చిందంటే పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఆక్సిజన్ ను విమానాల్లో విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. సెకండ్ వేవ్ ను అంచనా వేయడంలో మోదీ సర్కార్ ఘోరంగా విఫలమైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా పలు అగ్రదేశాలు ఘాటుగా విమర్శించాయి కూడా. ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తమైంది. ఇంత జరుగుతున్నా కూడా మోదీ సర్కార్ మాత్రం రాజకీయాల వైపే మొగ్గు చూపించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. బెంగాల్, కేరళ, తమిళనాడు ఎన్నికలపైనే బీజేపీ ఫోకస్ పెట్టింది. ఇదే సెకండ్ వేవ్ లో కేసులు పెరిగేందుకు కారణమైందనే విమర్శలు వెల్లువెత్తాయి కూడా. వీటికి తోడు పార్టీ ఫిరాయింపులపై కూడా ఇప్పటికే పార్లమెంట్ లో ప్రస్తావించాలని ముందే నిర్ణయించారు. ఇక పెట్రో మంట వ్యవహారంపై అయితే సామాన్యులు అగ్గిమీద గుగ్గిలంలా ఉన్నారు. ఈ విషయం పార్లమెంట్ ను కుదిపేస్తుందని అంతా భావించారు. కానీ అసలు ఆ ప్రస్తావనే లేదు.
కానీ ఇవేవీ ఇప్పుడు ఎక్కడా కనిపించటం లేదు. అంతా ఒకటే మాట. పెగాసస్ వ్యవహారం. ఫోన్ హ్యాకింగ్ కోసం పెగాసస్ సాఫ్ట్ వేర్ ను కేంద్రం ప్రయోగించిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రజాస్వామ్య హక్కులకు భంగం కలిగించేలా కేంద్రం వ్యవహరిస్తోందని విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. పార్లమెంట్ ఉభయ సభల్లో అదే రగడ. కేంద్ర ఐటీ శాఖ మంత్రి సమాధానంపై ఏ మాత్రం సంతృప్తి వ్యక్తం చేయని విపక్షాలు... కేంద్ర హోమ్ మంత్రి రాజీనామాకు పట్టుబడుతున్నాయి. ఆయన చేసేది లేదు.. వీళ్లు సభను నడవనిచ్చేది లేదు... అంటున్నారు విశ్లేషకులు. ఇదే రగడతోనే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయేలా ఉన్నాయి మరి.