మీలాంటివాళ్ల‌ను చాలామందిని చూశా..??

Garikapati Rajesh

ప‌శ్చిమ‌బెంగాల్ ఎన్నిక‌ల్లో గెల‌వ‌డ‌మే ల‌క్ష్యంగా కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల ప్రాణాల‌ను కూడా ప‌ణంగా పెట్టిన సంగ‌తి తెలిసిందే. క‌రోనా రెండోద‌శ ఉధృతి గురించి వైద్య‌నిపుణులు ఎంత హెచ్చ‌రించినా వాటిని పెడ‌చెవిన పెట్టి భారీ బ‌హిరంగ‌స‌భ‌లు, ర్యాలీలు నిర్వ‌హించారు. అంతా అయిన త‌ర్వాత మిగిలిందేమిటంటే.. ఎన్నిక‌ల్లో ఓట‌మి.. మ‌మ‌తా బెన‌ర్జీ ముఖ్య‌మంత్రి అవ‌డం.. బీజేపీ త‌రఫున గెలిచిన ఎమ్మెల్యేల్లో ఎక్కువ‌మంది తృణ‌మూల్‌వైపు ఫిరాయించ‌డానికి సిద్ధం కావ‌డం.

ప్ర‌జ‌ల ప్రాణాల‌క‌న్నా రాజ‌కీయాలే ముఖ్యం!
ఆసుప‌త్రుల్లో ఆక్సిజ‌న్ అందుబాటులో లేదు.. టీకాలు అందుబాటులో లేవు.. రాష్ట్రాల‌ను ప‌ట్టించుకునేవారే లేరు.. దేశ‌మంతా అల్ల‌క‌ల్లోలంగా మారింది. మ‌రోవైపు కుంభ‌మేళా క‌రోనా హాట్‌స్పాట్‌గా మారింది. ఎంద‌రో త‌మ ప్రాణాల‌ను కోల్పోయారు. అయినా స‌రే కేంద్ర ప్ర‌భుత్వానికి చీమ‌కుట్టిన‌ట్లు కూడా లేదు. వారి మ‌దిలో ఎలాగైనా బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తాబెన‌ర్జీని దించేయాలి.. ఆమెపై త‌మ‌దే పైచేయి అని నిరూపించుకోవాల‌నే ఆలోచనేకానీ దేశంలో ప‌రిస్థితులు ఎలా ఉన్నాయి.. వాటిని చ‌క్క‌దిద్దుదామ‌నే ప్ర‌ణాళిక‌లుకానీ ఏవీ లేవు. అంతా రాజ‌కీయంవైపే.. అన్నీ రాజ‌కీయ వ్య‌వ‌హారాలేకానీ ప్ర‌జ‌ల‌కు క‌రోనా స‌మ‌యంలో ఉప‌యోగ‌ప‌డిన ప‌ని ఒక్క‌టి కూడా లేదు. చివ‌ర‌కు ప్ర‌జ‌లంతా ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకొని బ‌తికితే బ‌లుసాకు తినైనా బ‌త‌కొచ్చు అనే ధోర‌ణికి వ‌చ్చేశారంటే కేంద్ర ప్ర‌భుత్వం క‌రోనాపై ఎంత‌లా చేతులెత్తేసిందో అర్థం చేసుకోవ‌చ్చు.

ఉత్త‌రాఖండ్ రూపంలో బెంగాల్‌పైకి ఆయుధం?
ఉత్త‌రాఖండ్ ముఖ్య‌మంత్రి రూపంలో న‌రేంద్ర‌మోడీ,అమిత్‌షా కు ఒక ఆయుధం దొర‌కింది. దానిద్వారా బెంగాల్ టైగ‌ర్‌ను బంధించాల‌ని అనుకుంటున్నారు. క‌రోనావ‌ల్ల ఎన్నిక‌లు నిర్వ‌హించ‌లేని ప‌రిస్థితి ఉంది కాబ‌ట్టి ఆరునెల‌ల్లోపు ముఖ్య‌మంత్రిగా ఎన్నిక‌వ‌డం అసాధ్య‌మంటూ వేరేవారిని ముఖ్య‌మంత్రిగా నియ‌మించారు. ఇప్పుడు ఇదే సూత్రాన్ని బెంగాల్‌కు వ‌ర్తింప‌చేయాల‌ని వారి ఆలోచ‌న‌. శాస‌న‌స‌భ‌లోకానీ, శాస‌న‌మండ‌లిలోకానీ, లోక్‌స‌భ‌లోకానీ ఏ ప‌ద‌వైనా చేప‌డితే ఆరునెల‌ల్లోపు ఎన్నిక‌వ్వాల్సి ఉంటుంద‌నే విష‌యం మ‌న‌కంద‌రికీ తెలిసిందే. న‌వంబ‌రు నాలుగోతేదీకి మ‌మ‌తాబెన‌ర్జీ ముఖ్య‌మంత్రి ప‌ద‌వి చేప‌ట్టి ఆరునెల‌ల స‌మ‌యం పూర్త‌వుతుంది. ఎన్నిక‌లు నిర్వ‌హించ‌లేక‌పోతే త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. అయితే మ‌మ‌తేమ‌న్నా త‌క్కువ తిందా.. మోడీ, అమిత్షా లాంటివారిని త‌న రాజ‌కీయ జీవితంలో ఎంతోమందిని చూసి ఉంటుంది. అందుకే అవ‌స‌ర‌మైతే నాలుగోతేదీ త‌ర్వాత త‌న ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసి అవ‌స‌ర‌మైతే ఒక‌రోజుకానీ, రెండురోజులుకానీ కొంత విరామం తీసుకొని మ‌ళ్లీ ముఖ్య‌మంత్రిగా ప‌గ్గాలు చేప‌ట్ట‌బోతున్నారు. ఇప్ప‌టికే ఆమె కోసం భవానీపూర్ ఎమ్మెల్యే త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. క‌రోనా ఉధృతంగా ఉన్న స‌మ‌యంలో కూడా ఎవ‌రి మాట‌లు విని కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఎన్నిక‌లు నిర్వ‌హించిందో దేశ‌మంత‌టికీ తెలుసు. అలాంటి ఎన్నిక‌ల సంఘం రాజ్యాంగ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఎన్నిక‌లు నిర్వ‌హిస్తుందా?  లేదంటే ఇంకా ఎవ‌రిమాటైనా విని వాయిదా వేస్తుందా? అనేది తేలాలంటే కొద్దిరోజులు వేచిచూడాల్సి ఉంది.!!







మరింత సమాచారం తెలుసుకోండి:

tag

సంబంధిత వార్తలు: