ఈటెలను లవ్ చేసే బ్యాచ్ వస్తే.. సంజ‌య‌న్న నిర్ణ‌యం ఏందో..?

తెలంగాణ‌లో ఇత‌ర పార్టీల‌నుంచి నేత‌ల‌ను చేర్చుకుని బ‌ల‌ప‌డే దిశ‌గా గ‌ట్టి ప్ర‌య‌త్నాల్లో ఉన్న బీజేపీకి అచిర‌కాలంలోనే అంత‌ర్గ‌త పోరు త‌ప్ప‌క‌పోవ‌చ్చ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి బీజేపీ అట‌ల్‌బిహారీ వాజ్‌పేయి, లాల్‌కృష్ణ అద్వానీల హ‌యాంలో సైద్దాంతిక నిబ‌ద్ద‌త క‌లిగిన నాయ‌కుల‌కే పెద్ద పీట వేసేది. అందుకే ఆ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా నాయ‌కులు పార్టీని అంటిపెట్టుకునే ఉండేవారు. కానీ ఇప్పుడు న‌డుస్తున్నది మోదీషాల జ‌మానా. ఎన్నిక‌ల యుద్ధంలో గెల‌వ‌డమే ఇప్ప‌డు బీజేపీ ప‌ర‌మావ‌ధి. అందుకే ఆ పార్టీ ఇత‌ర పార్టీల నుంచి బ‌ల‌మైన నాయ‌కుల‌ను ఆక‌ర్షించ‌డానికి ప్రాధాన్య‌మిస్తోంది. ఇప్పుడు తెలంగాణ బీజేపీలో దీర్ఘ‌కాలంపాటు ఆ పార్టీని భుజాన మోసిన నాయ‌కుల్లో అతికొద్దిమంది మాత్ర‌మే మిగిలారు. కాంగ్రెస్ పార్టీలో ప్ర‌ముఖ పాత్ర పోషించిన ప‌లువురు నాయ‌కులు ఇప్పుడు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు మ‌రికొంద‌రు ఇత‌ర పార్టీల నుంచి బీజేపీ దిశ‌గా న‌డుస్తున్నారు. అయితే వీరు మాత్ర‌మే కాదు.. వీరితోపాటుగా ఆయా పార్టీల సంస్కృతి కూడా బీజేపీలోకి ప్ర‌వేశించ‌డం అనివార్యంగా మారింద‌ని చెప్పాలి.
కొత్త‌గా చేరే నాయ‌కుల కార‌ణంగా పార్టీలో త‌మ ప్రాధాన్యం ఎక్క‌డ త‌గ్గిపోతుందోన‌నే ఆందోళ‌న  బీజేపీ రాష్ట్ర‌నాయ‌క‌త్వంలో ఇప్ప‌టికే  ఏర్ప‌డిన‌ట్టు తెలుస్తోంది. అయితే పార్టీ బ‌లం పుంజుకుంటేనే అధికారం చేజిక్కించుకోగ‌ల‌మ‌ని గుర్తుంచుకోవాల‌ని అధిష్ఠానం హితోప‌దేశం చేయ‌డంతో చేరిక‌ల‌కు గ్రీన్ స‌గ్న‌ల్ ప‌డింద‌ట‌. అయితే ఇవ‌న్నీ ముందుగానే ఊహించిన ఈటెల త‌న‌కు ప్రాధాన్య‌మిచ్చే అంశంలో పార్టీ నుంచి స్ప‌ష్ట‌మైన హామీలు తీసుకునేందుకే ఆగిన‌ట్టు తెలుస్తోంది. ఈటెల బీసీల‌పై బ‌ల‌మైన ప్ర‌భావం చూప‌గ‌లిగిన నేత‌గా అంచ‌నాలు ఉన్నాయి. ఆయ‌న బీజేపీలోకి వ‌స్తే ఆయ‌నకు మ‌ద్ద‌తుగా రాష్ట్ర‌వ్యాప్తంగా మ‌రికొంద‌రు నాయ‌కులు బీజేపీలోకి వ‌స్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఉన్న‌ బండి సంజ‌య్ కూడా బీసీ నేతే. ఈటెల‌ను అధిష్ఠానం వ‌ద్ద‌కు తీసుకెళ్లింది ఆయ‌నే. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను దీటుగా దూకుడుగా ఎదుర్కొంటున్నార‌న్న గుర్తింపు పార్టీ అధిష్ఠానం వ‌ద్ద‌ బండి సంజ‌య్‌కు ఉంది. ఈ నేప‌థ్యంలో పార్టీలో ఈటెలకు ప్రాధాన్యం పెరిగితే ఆయ‌న ఏమేర‌కు స్వాగ‌తిస్తార‌న్న‌ది చూడాల్సి ఉంది. మ‌రోప‌క్క కాంగ్రెస్ పార్టీనుంచి బీజేపీలోకి వ‌చ్చిన డీకే అరుణ త‌న వ‌ర్గం బ‌లాన్ని పెంచుకునేందుకు కొండా విశ్వేశ్వ‌ర్‌రెడ్డి వంటివారిని పార్టీలోకి తెచ్చే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. డీకే అరుణ‌కు ఈటెల రాజేంద‌ర్‌కూ రాజ‌కీయ విభేదాలున్నాయి. అలాగే ఈటెల‌కూ పెద్దిరెడ్డికీ మ‌ధ్య‌ స‌త్సంబంధాలు లేవు. ఈ నేప‌థ్యంలో  కొత్త నేత‌ల చేరిక‌ల‌తో భ‌విష్య‌త్తులో తెలంగాణ బీజేపీలో అధికార కేంద్రాలు, గ్రూపురాజ‌కీయాలు త‌ప్ప‌క‌పోవ‌చ్చ‌న్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: