అంద‌రికీ వ్యాక్సిన్లు అందాలంటే ఇంకా మూడేళ్లు?

భార‌త్‌లో కరోనా మ‌హమ్మారి విలయ తాండ‌వం చేస్తున్న నేప‌థ్యంలో ప్ర‌జ‌లు వ్యాక్సిన్ల కోసం క్యూలు క‌డుతున్న విష‌యం తెలిసిందే. అయితే వ్యాక్సిన్ల‌కు దేశ‌వ్యాప్తంగా తీవ్ర కొర‌త ఏర్ప‌డింది. దేశీయంగా త‌యార‌య్యే టీకాల ఉత్ప‌త్తి అవ‌స‌రాల‌కు త‌గినంతగా లేక‌పోవ‌డంతో, వాటి ఉత్ప‌త్తిని పెంచేందుకు, వ్యాక్సిన్ల‌ను విదేశాల నుంచి దిగుమ‌తి చేసుకునేందుకు కేంద్రం ప్ర‌యత్నాలు సాగిస్తోంది. మ‌రోప‌క్క ప్రభుత్వాలు, ఫార్మా కంపెనీలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకుంటోన్న ఘ‌ట‌న‌లు ప్రజల్ని మరింత అయోమయానికి గురిచేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే దేశంలో వ్యాక్సిన్ ఉత్ప‌త్తి చేస్తున్న రెండు ఫార్మా కంపెనీల్లో ఒక‌టైన‌ సీరం సంస్థ సీఈవో అద‌ర్ పూనావాలా చేసిన ప్ర‌క‌ట‌న ప్ర‌జ‌ల‌ను ఒకింత ఆందోళ‌న‌కు గురిచేస్తోంద‌ని చెప్పాలి. సీరం సంస్థ కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను త‌యారు చేస్తోన్న విష‌యం తెలిసిందే.  ప్ర‌భుత్వాల బెదిరింపులతో భారత్ ను వీడి ప్రస్తుతం లండన్ లో ఉంటోన్న ఆయన టీకాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రపంచంలో అత్యధిక జనాభాగల రెండు దేశాల్లో భారత దేశం ఒకట‌నే విషయాన్ని అంద‌రూ గుర్తుంచుకోవాల‌ని అదర్ పూనావాలా మంగళవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.ఇంత‌ పెద్ద‌ దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం రెండు లేదా మూడు నెలల్లో పూర్తి చేయ‌డం సాధ్యం కాదన్నారు. మ‌రింత కాలం ప‌డుతుంద‌ని ఆయ‌న తెలిపారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా అంద‌రికీ వ్యాక్సిన్లు అందించాలంటే రెండుమూడేళ్లు ప‌డుతుంద‌ని పూనావాలా త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. అమెరికాలోని అనేక‌ ఫార్మా కంపెనీల కన్నా రెండు నెలలు ఆలస్యంగా తమకు అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో వాడే మందుల త‌యారీకి అనుమతులు వచ్చాయని, అయినప్పటికీ సీరం ఇన్‌స్టిట్యూట్ 200 మిలియన్ డోసుల వ్యాక్సిన్‌ను ఇప్ప‌టిదాకా అందజేసిందని చెప్పారు. ఈవిష‌యంలో సీరం సంస్థ ప్రపంచంలోని మూడు అగ్రశ్రేణి సంస్థల్లో ఒకటిగా నిలిచిందని ఆయ‌న తెలిపారు.

 గతంలో ఈ వ్యాక్సిన్‌ను ఎగుమతి చేయడానికి కారణాలను కూడా ఈ ప్ర‌క‌ట‌న‌లో పూనావాలా వివరించారు. త‌మ‌ సంస్థ ఉత్పత్తి చేస్తున్న కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను దేశ ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టి, ఎగుమతి చేయడం లేదని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. గత ఏడాది కోవిడ్-19 మహమ్మారి ప్రారంభ దశలో ఉన్నపుడు ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలకు అనుగుణంగా మాత్ర‌మే గతంలో ఈ వ్యాక్సిన్‌ను విదేశాలకు పంపించినట్లు చెప్పారు. కోవాక్స్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఇప్ప‌టి వ‌ర‌కు 124 దేశాల‌కు 6.5 కోట్ల డోసుల‌ను ఈ సంస్థ నుంచి పంపిణీ చేశారు. ఇదిలా ఉంటే, గత ఒప్పందాల ప్ర‌కారం ఇండియాలోని సీరం సంస్థ టీకాలు అందివ్వ‌డం లేద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఆవేద‌న వ్య‌క్తం చేసింది. భార‌త్‌లో వైర‌స్ విజృంభ‌ణ త‌గ్గిన త‌ర్వాత‌.. సీరం సంస్థ కోవాక్స్ కోసం నిబ‌ద్ధ‌త‌తో టీకాల‌ను అందించాల‌ని డ‌బ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: