హెరాల్డ్ ఎడిటోరియల్ : ఒక్కసారిగా భారత్ పరువంతా పోయిందే ?
ఒక వ్యక్తి ఒకే ఒక వ్యక్తి నిర్లక్ష్యం, అనాలోచితం వల్ల దేశం పరువంతా పోయింది. ప్రపంచ దేశాల ముందు ఇపుడు దేహీ అని నిలబడాల్సిన పరిస్ధితి దాపురించింది. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రత కారణంగా దేశంలో పరిస్ధితులు పూర్తిగా క్షీణించిపోతున్నాయి. దీని కారణంగా మయున్మార్, భూటాన్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ లాంటి చిన్న చిన్న దేశాలు కూడా మనకు సాయం అందిస్తున్నాయంటే మనదేశంలో పరిస్ధితులు ఎంతగా దిగజారిపోయాయో అర్ధమైపోతోంది. సాయం అందుకోవటానికి, చేయటానికి చిన్న దేశాలు, పెద్ద దేశాలనే తేడాలేదు. పెద్ద దేశాల నుండి తప్ప చిన్నదేశాల నుండి సాయం అందుకోవటం అవమానమూ కాదు. కాకపోతే చిన్నదేశాల నుండి కూడా సాయం అందుకునేంత స్ధితికి దేశంలో పరిస్ధితులను దిగజార్చేయటమే అవమానంగా ఉంది.
దేశంలో పరిస్ధితులు దిగజారిపోవటానికి, దేశంయావత్తు కరోనా వైరస్ సెకెండ్ వేవ్ సంక్ష్సభంలో కూరుకుపోవటానికి ప్రధానమంత్రి నరేంద్రమోడి నిర్లక్ష్యమే ప్రధాన కారణమని శాస్త్రజ్ఞులు, వైద్య నిపుణులు బహిరంగంగానే మండిపోతున్నారు. సెకెండ్ వేవ్ తీవ్రతను, నివారణగా తీసుకోవాల్సిన ముందుజాగ్రత్తలపై ఫిబ్రవరి-మార్చిలోనే సీసీఎంబి డైరెక్టర్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ముందుగానే హెచ్చరించినా మోడి పట్టించుకోలేదన్న విషయం తాజాగా వెలుగుచూడటం సంచలనంగా మారింది. మార్చిలోనే దేశంలో లాక్ డౌన్ పెట్టాలని శాస్త్రజ్ఞులు, వైద్య నిపుణులు సూచించినా కేవలం ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ గెలుపు, కుంభమేళాను దృష్టిలో పెట్టుకుని మోడి ఎవరి సూచనలను పట్టించుకోలేదనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. అందుకనే దేశవ్యాప్తంగా మోడిని పదవిలో నుండి దిగిపోమ్మంటు ట్విట్టర్లో డిమాండ్లు పెరిగిపోతున్నాయి.
ముదిరిపోయిన సెకెండ్ వేవ్ సంక్షోభంలో బంగ్లాదేశ్ మనదేశానికి 10 వేల రెమ్ డెసివిర్ డోసులను పంపింది. భూటాన్ మెడికల్ ఆక్సిజన్ను పంపింది. అలాగే నేపాల్, మయన్మార్, శ్రీలంక నుండి కూడా వైద్యసామగ్రి అందింది. మామూలుగా అయితే పై దేశాలకు మనదేశం నుండి సాయం అందేవి. నిత్యం సంక్షోభాలతో, తీవ్రవాదుల దాడులతో ముణిగితేలుతున్న పాకిస్ధాన్ కూడా మనకు సాయం అందిస్తామని ప్రకటించిందంటే మనదేశంలో పరిస్ధితులు ఎంతగా దిగజారిపోయాయో అర్ధమైపోతోంది. దేశానికి సరిపడా టీకాలను, ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచలేక, సరఫరా చేయలేక కేంద్రప్రభుత్వం చేతులెత్తేసింది. లాక్ డౌన్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకునే విషయాన్ని కూడా రాష్ట్రాల మీదకే తోసేసింది. సెకెండ్ వేవ్ ఉదృతి నియంత్రణ విషయంలో అన్నింటిలోను మోండి దారుణంగా విఫలమయ్యారు. ఇందుకనే చిన్న చిన్న దేశాలు కూడా భారత్ ను ఆదుకునేందుకు ముందుకొస్తున్నాయి. మొత్తానికి తన చేతకానితనం వల్ల ప్రపంచం ముందు దేశం పరువంతా మోడి తీసేశారు.